అమల్లోకి వచ్చిన 'ఎపిడమిక్ చట్టం'

by Shyam |

దిశ, న్యూస్ బ్యూరో

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం 1897 నాటి ‘ఎపిడమిక్ చట్టం’ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాన్ని అమలుచేయాల్సిందిగా వారం రోజుల క్రితమే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఢిల్లీ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలులోకి తెచ్చాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సైతం అమల్లోకి తెచ్చింది. రానున్న సంవత్సర కాలం పాటు ఇది అమల్లో ఉంటుందని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ చట్టం అమల్లోకి రావడం ద్వారా జిల్లా కలెక్టర్‌కు కొన్ని అదనపు అధికారాలు సంక్రమిస్తాయి. ఈ చట్టం ద్వారా ఏదేని ఒక ప్రాంతంలో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టరే నిర్ణయం తీసుకుని ఆ ప్రాంతంలో వ్యాప్తి నిరోధకానికి తగిన చర్యలు తీసుకోడానికి వీలు కలుగుతుంది.

తక్షణం ఈ చట్టంలోని మార్గదర్శకాలు అమల్లోకి వస్తున్నట్లు పేర్కన్న ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే కాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం కరోనా వ్యాధి లక్షణాలను నిర్ధారించే స్క్రీనింగ్ టెస్ట్‌లను నిర్వహించడానికి వెసులుబాటు కల్పించారు. అవసరాన్ని బట్టి అనుమానితులకు లేదా ఐసొలేషన్‌లో ఉంచాల్సిన పేషెంట్లకు ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి పేషెంట్ల పూర్తి వివరాలను ఆయా ఆసుపత్రులు సేకరించి క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి తెలియజేయాల్సి ఉంటుందని సీఎస్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ ట్రస్టు కూడా నెట్‌వర్క్ ప్రైవేటు ఆసుపత్రుల్లో పాతిక బెడ్‌లను సమకూర్చాల్సిందిగా లేఖ రాసింది.

చట్టంతో పకడ్బందీ చర్యలు

విదేశీ ప్రయాణం చేసివచ్చిన ప్రతీ ఒక్కరూ ఈ చట్టం ప్రకారం నిర్బంధంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడం ఒక తప్పనిసరి నిబంధనగానే ఉంటుంది. ప్రయాణీకులకు లక్షణాలు ఉన్నా లేకపోయినా క్వారంటైన్ మాత్రం తప్పనిసరి అవుతుంది. అలాంటి పేషెంట్ల వివరాలను ఆసుపత్రులు ఎవ్వరికీ లీక్ చేయరాదని, ఒకవేళ చేసినట్లు రుజువు అయినట్లయితే ఎపిడమిక్ చట్టం ప్రకారం (సెక్షన్ 188) వారిపై చర్య తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది. ఏదేని నిర్దిష్ట ప్రాంతంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కలెక్టర్ అభిప్రాయానికి వచ్చినట్లయితే ఆ ప్రాంతంలో మిగిలిన ప్రజానీకానికి సోకకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోడానికి విస్తృత అధికారాలు ఉంటాయి.

ఆ ప్రాంతంలోకి ఇతరులెవ్వరినీ అనుమతించకుండా నిషేధాజ్ఞలు విధించవచ్చు. అన్ని విద్యా సంస్థలు, సినిమాహాళ్లు, జనం గుమికూడే వాణిజ్య సముదాయాలు, పార్కులు, మ్యూజియం తదితరాలన్నింటినీ మూసివేసే అధికారం ఉంటుంది. ఏ ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాన్ని క్వారంటైన్, ఐసొలేషన్ కేంద్రంగా వినియోగించుకోవచ్చు. ఇలాంటి కొన్ని విస్తృత అధికారాలు ఆ జిల్లా కలెక్టర్‌కు ఉంటాయి.

Tags:Telangana, Epidemic Act, Corona, District Collector, Isolation, Quarantine

Advertisement

Next Story

Most Viewed