ఆ నెల నుంచి పీఆర్సీ వేతనం.. అరియర్లు, హెచ్‌ఆర్‌ఏలపై కీలక నిర్ణయం

by Shyam |   ( Updated:2021-06-08 21:08:56.0  )
ఆ నెల నుంచి పీఆర్సీ వేతనం.. అరియర్లు, హెచ్‌ఆర్‌ఏలపై కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పీఆర్సీ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినా జూన్ నుంచి అమలు చేసి చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. పెరిగిన వేతనాలను జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం సుదీర్ఘంగా ఎనిమిదిన్నర గంటలపాటు సమావేశమైన మంత్రివర్గం ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అంశంతో పాటు అనేక విషయాలపై లోతుగా చర్చించింది.

గతంలో మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదించిన పీఆర్సీ నివేదిక ప్రకారం గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి మానిటరీ బెనిఫిట్‌‌ను అమలు చేయాలని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి క్యాష్ బెనిఫిట్‌ను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక 2018 జూలై 1వ తేదీ నుంచి గతేడాది మార్చి 31వ తేదీ వరకు ఉన్న కాలానికి వేతన పెంపును మంత్రివర్గం నోషనల్ బెనిఫిట్‌గా పేర్కొన్నది. పీఆర్సీ వేతన పెంపు జూన్ నెల నుంచి అమల్లోకి తెచ్చి చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించినందున ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి లభించాల్సిన క్యాష్ బెనిఫిట్‌ను జూలై నెలలో అందుకోబోయే వేతనంతో లభిస్తుంది. అయితే ఉద్యోగులు గడచిన రెండు నెలల పెంపు బకాయిలను జూలై నెలలో అందుకోబోయే శాలరీతో కలిపి ఒకేసారి అందుకుంటారా.? లేక వాయిదా పద్ధతిలో అందుకుంటారా.? అనేది జీవోలో వెల్లడికానున్నది.

ఇదిలా ఉండగా పింఛనుదార్లకు మాత్రం గతేడాది ఏప్రిల్ 1వ తేదీ మొదలు ఈ ఏడాది మే 31వ తేదీ వరకు చెల్లించాల్సిన బకాయిల (అరియర్స్)ను 36 వాయిదాల్లో చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పింఛనుదార్లంతా కలిపి 9,21,037 మందికి 30 శాతం చొప్పున పీఆర్సీ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గతంలోనే అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగానే ప్రకటన కూడా చేశారు. ఈ ప్రకటనకు కూడా తాజాగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. హెచ్‌ఆర్‌ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

Next Story