మూడే గంటల్లో అసెంబ్లీ ఓవర్..

by Shyam |   ( Updated:2020-09-10 22:17:04.0  )
మూడే గంటల్లో అసెంబ్లీ ఓవర్..
X

దిశ, న్యూస్‌బ్యూరో: రెవెన్యూ బిల్లు, కరోనాపై చర్చలతో బుధవారం వాడీవేడిగా సాగిన అసెంబ్లీ సమావేశాలు గురువారం మాత్రం చప్పగా సాగాయి. కేవలం మూడు గంటల్లోనే అసెంబ్లీ వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ కార్యక్రమాలతోనే సభా కార్యకలాపాలు సరిపోయాయి. మంత్రి కేటీఆర్ కొన్ని బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి సమావేశాల్లో ప్రసంగించకపోయినా కేటీఆర్ మాత్రం రెండుచోట్లా హడావుడి చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో తన శాఖకు సంబంధించిన అంశాలతో పాటు బిల్లులపై స్వల్ప వివరణ ఇచ్చారు. కౌన్సిల్‌కు సైతం హాజరై కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టారు. జీరో అవర్‌లో చాలా మంది అధికార, ప్రతిపక్ష సభ్యులు వారివారి నియోజకర్గాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా మంత్రులకు మొరపెట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ గుదిబండగా మారిందన్న అంశం కూడా జీరో అవర్‌లో ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా స్థానికంగా అనేక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని, పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు సభ్యులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అంతా భేషుగ్గా ఉందని సందర్భం వచ్చినప్పుడల్లా గొప్పలు చెప్పుకునే మంత్రులు ఇప్పుడు సభా వేదికగా సభ్యులు ప్రస్తావించిన సమస్యలకు మాత్రం ‘పరిష్కరిస్తాం అధ్యక్షా… నోట్ చేసుకున్నాం… ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ప్రకటన చేస్తాం.. ‘ లాంటి సమాధానాలతో సరిపెట్టారు.

మండలిలో..

అసెంబ్లీలో కరోనాపై చర్చ బుధవారమే ముగిసినా, కౌన్సిల్‌లో మాత్రం గురువారం జరిగింది. మంత్రి ఈటల రాజేందర్ మొత్తం కరోనా నిర్వహణ గురించి లిఖితపూర్వకమైన నోట్‌ను సభ్యులకు అందించడంతో పాటు చర్చ సందర్భంగా సభ్యులడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. వైద్యారోగ్య రంగంలో ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన సుమారు 5,200 పోస్టులను భర్తీ చేశామని, మరో ఆరు వేల పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వైద్య కళాశాలలను కొత్తగా నెలకొల్పడంతో పాటు కొన్ని కళాశాలల్లో డిగ్రీ, పీజీ సీట్ల సంఖ్యను పెంచుకోగలిగినట్లు వివరించారు.

కార్పొరేట్ ఆస్పత్రులపై మంత్రి కన్నెర్ర..

కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులపై మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కరోనా కష్టకాలాన్ని ఈ ఆసుపత్రులు లాభాలు ఆర్జించుకోడానికి వాడుకోవడం దురదృష్టకరమని, మానవతా దృక్పథంతో పాటు బాధ్యతను మరిచాయని అన్నారు. వేల రూపాయలను లక్షల్లోకి మార్చుకుని అందినకాడికి దోచుకున్నాయని, ప్రభుత్వ నిబంధనలను బేఖతారు చేశాయని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోని రెండు ఆసుపత్రులకు కరోనా చికిత్స అనుమతులను రద్దుచేయాల్సి వచ్చిందన్నారు.

ముఖ్యమంత్రి సైతం చివరి హెచ్చరిక చేసి ఇకపైన దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసి ఐఏఎస్ అధికారులతో టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సాధారణ వార్డుల్లో సైతం లక్షల రూపాయల ఛార్జీలు వేసి దిగువ మధ్యతరగతి ప్రజలను దారిద్ర్య రేఖకు తీసుకెళ్ళాయని విచారం వ్యక్తం చేసిన మంత్రి కొద్దిమంది పేషెంట్ల నుంచి రూ. 30 లక్షల మేర బిల్లు వేసినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. గరిష్టంగా రూ. 50 వేలు, రూ. 60 వేలతో అయ్యే చికిత్సను రూ. 20 లక్షల దాకా పెంచి అనైతిక పద్ధతులకు పాల్పడ్డాయని కార్పొరేటు ఆసుపత్రులపై దుమ్మెత్తిపోశారు.

నేడు రెవెన్యూ బిల్లుపై చర్చ..

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లు, దానికి అనుబంధంగా ఉన్న మరో మూడు బిల్లులపై శుక్రవారం చర్చ జరగనుంది. సంఖ్యాబలం ఆధారంగా ప్రతిపక్ష సభ్యులకు సమయాన్ని కేటాయించనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్నమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నామని, అవినీతికి ఆస్కారమే ఉండదని పేర్కొన్న నేపథ్యంలో కొత్త విధానంతో తలెత్తే సమస్యలను చర్చ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు.

చరిత్రాత్మక బిల్లు అని స్వయంగా ముఖ్యమంత్రే ప్రస్తావించినందున చర్చల అనంతరం సమాధానం ఇవ్వనున్నారు. సాయంత్రం తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. అసెంబ్లీలో చర్చ ముగిసిన తర్వాత కౌన్సిల్‌లో చర్చ జరగనుంది. రెండు సభల్లో ఆమోదం తర్వాత చట్టంగా మారనుంది.

Advertisement

Next Story

Most Viewed