వాట్సాప్ వీడియో కాల్‌లో సరికొత్త ఫీచర్

by S Gopi |
వాట్సాప్ వీడియో కాల్‌లో సరికొత్త ఫీచర్
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే కలర్, థీమ్ మార్చుకునే ఫీచర్లతో పాటు మరికొన్నిటిని తీసుకొచ్చింది. తాజాగా మరో అద్భుతమైన కొత్త అప్‌డేట్‌ వాట్సాప్ వినియోగదారులకు అందించనుంది. వాట్సాప్ గురించి సమాచారాన్ని అందించే వెబ్‌సైట్ డబ్ల్యూఏ బెటాఇన్ఫో ప్రకారం, ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వీడియో కాల్ కనెక్ట్ అయిన సమయంలో మ్యూజిక్ ఆడియోను షేర్ చేసుకునేందుకు వీలవుతుంది. 'ప్రస్తుతానికి ఈ ఫీచర్ బెటా వినియోగదారుల వద్ద పరీక్షిస్తున్నారు, వీడియో కాల్‌లో ఉన్నవారు తమ స్క్రీన్ షేర్ చేసినప్పుడు, వారి మొబైల్‌లో ప్లే చేసే ఆడియో మరొకరికి కూడా షేర్ అవుతుందని' డబ్ల్యూఏ బెటాఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ ఒకరినొకరు కాల్‌లో ఉన్న సమయంలోనే కాకుండా గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా వినియోగించవచ్చు. ఈ ఫీచర్‌ను మరికొద్ది వారాల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది. ఇదికాకుండా వాట్సాప్ మరో ఫీచర్‌పై కూడా పనిచేస్తోందని సమాచారం. వినియోగదారులు వారి ఫోన్ నంబర్లను షేర్ చేసుకోకుండానే కనెక్ట్ అయ్యే సౌకర్యాన్ని తేవడంపై పరిశీలిస్తోంది. ఇది వాట్సాప్ ప్లాట్‌ఫామ్ వినియోగాన్ని మరింత సులభతరం చేసేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తోంది.

Advertisement

Next Story