Star Link: సెల్‌టవర్ లేకున్నా ఇక మొబైల్ సేవలు! టెలికాం రంగంలో గేమ్ చేంజర్ గా స్టార్ లింక్?

by Prasad Jukanti |   ( Updated:2025-03-14 15:24:18.0  )
Star Link: సెల్‌టవర్ లేకున్నా ఇక మొబైల్ సేవలు! టెలికాం రంగంలో గేమ్ చేంజర్ గా స్టార్ లింక్?
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత టెలికాం రంగంలో (Indian Telecom Sector) చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయి. వినియోగదారులకు సేవలు అందించే విషయంలో దేశీయ టెలికాం సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వినియోగదారులకు రుచిచూపించేందుకు ఎయిర్‌టెల్ (Airtel) అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్‌తో (Star Link) జోడీ కట్టి అందరిని ఆశ్చర్యపర్చగా ఈ ఒప్పందం జరిగిన 24 గంటల వ్యవధిలోనే అంబానికి చెందిన రిలయన్స్ జియో (Jio) షాక్ ఇచ్చింది. శాటిలైన్ ఇంటర్నెట్ సేవల కోసం జియో స్టార్ లింక్‌తో డీల్ కుదుర్చుకుంది. దేశీయంగా అగ్రగామిగా ఉన్న రెండు టెలికాం సంస్థలు ఎలాన్ మస్క్ సంస్థతో ఒప్పందాల నేపథ్యంలో భారతీయ ఇంటర్నెట్ రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి? సిగ్నల్ లేకుండానే ఇక మొబైల్ సేవలు పొందవచ్చా? ఇంటర్నెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

100 దేశాల్లో స్టార్‌ లింక్ సేవలు..

ప్రస్తుతం 100కు పైగా దేశాల్లో స్టార్ లింక్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో 2021లోనే తీసుకురావాలని ఎలాన్ మస్క్ ఆశించగా రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఆలస్యం అయింది. ఇంతలో స్టార్ లింక్‌తో ఎయిర్ టెల్, జియో ఒప్పందంతో త్వరలోనే సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 5జీ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతున్నా ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య వేధిస్తూనే ఉంది. సరైన సిగ్నల్స్ లేని కారణంగా వాళ్లంతా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ లింక్ ఎంట్రీ ఇస్తే ఈ పరిస్థితికి చెక్ పడుతుందని టాక్ వినిపిస్తోంది. సంప్రదాయ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులకు భిన్నంగా స్టార్ లింక్ ‘లో ఎర్త్ ఆర్బిట్’ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్‌ను అందిస్తుంది. మస్క్ కంపెనీ స్టార్ లింక్‌కు ప్రస్తుతం ఆర్బిట్‌లో సుమారు 7000 శాటిలైట్స్ ఉన్నాయి. వాటి ద్వారా 100 దేశాల్లో 40 లక్షల సబ్ స్క్రైబర్లకు సేవలు అందిస్తోంది.

సొంత వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ ఉన్నా..

జియో, ఎయిర్ టెల్‌ ఇప్పటికే ఎయిర్‌ఫైబర్‌తో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. స్టార్ లింక్‌ అగ్రిమెంట్‌తో ఎయిర్ ఫైబర్ కంటే రాబోయే సేవలు ఎలా భిన్నంగా ఉంటానయే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 5G నెట్‌వర్క్‌ అధునాతన Wi-Fi 6 సాంకేతికతను ఉపయోగించి ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో ఉన్న రిసీవర్ ద్వారా హైస్పీడ్ వైర్ లెస్ ఇంటర్నెట్ (High Speed ​​Internet) సేవలు అందిస్తున్నాయి. వీటి కోసం జియో, ఎయిర్ టెల్ రెండూ తమ 5G నెట్‌వర్క్ టవర్లపై ఆధారపడుతున్నాయి. కానీ స్టార్ లింక్ నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. స్టార్ లింక్ ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్ కోసం భూమి మీద స్థిరమైన ప్రదేశంలో చిన్నపాటి రిసీవర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిసీవర్లు సమీపంలోని స్టార్ లింక్ శాటిలైట్ క్లస్టర్లకు అనుసంధానం అయ్యాక ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. మారుమూల, కొండ ప్రాంతాల్లోనేనా ఇంటర్నెట్ అందిస్తుంది. అదనపు హార్డ్‌వేర్ సహాయంతో విమానాలు, వాహనాలు, పడవల్లో కూడా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.

సెల్‌ఫోన్‌లో స్టార్ లింక్ వాడొచ్చా?

ప్రస్తుత టెక్నాలజీ మేరకు సెల్‌ఫోన్ ఉంటే చాలు ఎక్కడైనా ఇంటర్నెట్ సేవలు వినియోగించగలుగుతున్నాం. కానీ ఈ శాటిలైట్ కమ్యూనికేషన్‌లో అలాంటి అవకాశం ప్రస్తుతానికి లేదని, దీనికి కొంత పరిమితి ఉందని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో వైఫై మాదిరిగా కొంత విస్తీర్ణం పరిధిలోనే వినియోగించుకునే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే ఇటీవల ఐఫోన్ 16 ప్రో శాటిలైట్ ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లు పంపే అవకాశం కల్పించింది. అది ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. అయితే భవిష్యత్తులో నేరుగా శాటిలైట్ సేవలపై ఆధారపడి ఇంటర్నెట్, కాల్స్ చేసుకునేందుకు వీలుండే ఫోన్లను అందించే దిశగా కంపెనీలు సిద్ధం అవుతున్నాయి.

భారత్‌లో స్టార్ లింక్‌కు సవాళ్లు..

స్పేస్ ఎక్స్‌తో దేశీయ అగ్రగామి టెలికాం సంస్థలు ఒప్పందం చేసుకున్నప్పటికీ భారత్‌లో స్టార్ లింక్ ఎంట్రీకి అనేక సవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్ లింక్‌పై కేంద్ర ప్రభుత్వం కొన్ని కండిషన్స్ విధించినట్లు తాజా కథనాల ద్వారా తెలుస్తోంది. భారత్‌లో సేవలందించాలంటే దేశంలో కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించడం, నిలిపివేయడానికి వీలు ఉండేలా కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం కఠిన నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలు చేయిదాటిపోయేలా ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న స్టార్ లింక్ ప్రధాన కార్యాలయం తలుపు కొట్టాల్సిన అవసరం లేకుండా స్వదేశంలోనే తాము నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉండాలని కేంద్రవర్గాలు చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

READ MORE ....

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు.. వీడియో వైరల్







Next Story

Most Viewed