మళ్లీ ఆగింది.. ఈ హైదరాబాద్‌ మెట్రోకు ఏమైంది..?

by Anukaran |   ( Updated:2021-01-26 08:04:52.0  )
మళ్లీ ఆగింది.. ఈ హైదరాబాద్‌ మెట్రోకు ఏమైంది..?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మెట్రోకు ఏమైంది.. తరచూ ఆగిపోతుంది.. దీనికి శాశ్వతపరిష్కారం ఏంటి..? ఎప్పటి నుంచో నగరవాసులు, మెట్రో ప్రయాణికుల్లో మెదులుతున్న ప్రశ్న… హైదరాబాద్‌కు మెట్రో వస్తే విశ్వనగర గుర్తింపుతో పాటు.. ఏళ్లతరబడి నగరవాసులు అనుభవిస్తున్న ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని అందరూ భావించారు. అనుకున్న ప్రకారం హైదరాబాద్‌ మెట్రో మొదటి దశలో భాగంగా.. నవంబర్ 17, 2019న అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై పచ్చజెండా ఊపారు. ఆ తర్వాత జనాలు ఎగబడి మరీ మొదటి వారం రోజుల పాటు మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదించారు. నాగోల్ టు మియాపూర్ వరకు సరదాగా ప్రయాణం చేసి సంబురపడ్డారు. కానీ, ఆ అనుభూతి ఎక్కువ కాలం నిలువలేదు. రాను రాను మెట్రో రైలు పలు సమస్యలు తలెత్తడంతో నగరవాసులకు ఇష్టం తగ్గింది.

కొత్త మురిపం కొన్ని రోజులే అన్నట్టు హైదరాబాద్‌ మెట్రో పరిస్థితి మారింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ధరలో చార్జీలు లేవని తొలుత చాలామంది బస్సులకే మొగ్గు చూపారు. ఇదే సమయంలో ఉద్యోగస్తులు మాత్రం స్మార్ట్‌ కార్డులు తీసుకుంటూ మెట్రోలో ప్రయాణం చేసినప్పటికీ.. ఊహించిన స్థాయిలో నగర మెట్రోకు ఆదరణ లభించలేదు.

వాస్తవంగా చెప్పాలంటే మెట్రో రైలుతో సమయం ఆదా అవుతున్నప్పటికీ.. సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో లేకపోవడంతో డిమాండ్ తగ్గింది. అయినప్పటికీ ప్రాజెక్టులో భాగంగా.. ఎల్బీనగర్‌ నుంచి అమీర్‌పేట, అమీర్ పేట నుంచి హైటెక్‌సిటీ, జేబీఎస్ టు ఎంజీబీఎస్ వరకు సేవలు వివిధ దశల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్‌ మెట్రో పరుగులు తీయడం ప్రారంభించింది.

వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు:

అన్ని కారిడార్‌లల్లో పరుగులు తీస్తున్న మెట్రో రైలుకు సాంకేతిక సమస్యలు బ్రేకులు వేస్తూ వస్తున్నాయి. తరచూ మెట్రో రైలుకు బ్రేకులు పడుతుండంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.
ఇటీవల అమీర్‌పేట-హైటెక్‌సిటీ మధ్యలో రైలు పరిగెడుతున్న సమయంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ లైన్‌లో మెట్రో సేవలు 15 నిమిషాల పాటు నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రయాణికులను మార్గమధ్యలోని జూబ్లీహిల్స్‌ బస్టాండ్‌ వద్ద దిగిపోయారు. ఇలాగే, అన్ని కారిడార్‌లల్లో మెట్రో నిలిపోయిన అంశం బ్రేకింగ్ న్యూస్‌ అయింది. తరచూ మెట్రో సేవల్లో సమస్యలు రావడంతో నగరవాసులకు ఆ ప్రయాణంపై ఆసక్తి తగ్గుతోంది. ఈ విషయం మీడియా ముఖంగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు ఈరోజు కూడా హైదరాబాద్ మెట్రో మళ్లీ ఆగింది. నాగోల్ స్టేషన్‌లో డేటా కంట్రోల్ ‌ సిస్టమ్‌లో టెక్నీకల్ ప్రాబ్లమ్‌ వచ్చింది. దీంతో అన్ని రూట్లలో మెట్రో 15 నిమిషాల పాటు నిలిపివేశారు. అనంతరం యధాతథంగా సేవలను పునరుద్ధరించారు. అయితే, ఇలా అర్ధాంతరంగా మెట్రో రైలుకు బ్రేకులు పడడంతో ఉద్యోగాలకు వెళ్లి, వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి ఆఫీసుకు వెళ్దామని మెట్రో ఎక్కేవారికి ఎక్కడ నిలిచిపోతుందో అని లోలోపల సందేహం ఉన్నా.. ప్రయాణించకతప్పడం లేదని చెబుతున్నారు.దీనికి శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులకు సూచనలు చేస్తున్నారు. వేల కోట్లు ఖర్చుబెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్‌ మెట్రో చిన్న చిన్న సమస్యల కారణంగా పలుమార్లు నిలిచిపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. దీనికి శాశ్వాత పరిష్కారం చూపుతారో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed