చదువు నుంచి క్లీనింగ్ వరకు.. అన్ని వాళ్లే!

దిశ, న్యూస్‌బ్యూరో : స్కూళ్ల తాళాలు తెరుచుకుని పది రోజులు కావస్తోంది. ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులంతా పాఠశాలలకు రావాలని ప్రభుత్వం ఆదేశించడంతో వారంతా వస్తున్నారు. సుమారు ఆరు నెలల తర్వాత స్కూళ్లను తీయడంతో దుమ్ము, బూజు, అపరిశుభ్ర వాతావరణంతో స్వాగతం పలికాయి. స్కూళ్లను శుభ్రం చేసేందుకు ఏడాది కాంట్రాక్ట్‌తో సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేది. ఈ ఏడాది అలాంటివేమీ జరగలేదు. పంచాయతీ కార్మికులే స్కూళ్లలోనే శానిటేషన్ పనులు చేస్తారంటూ ఆదేశాలను జారీ చేసినా.. పర్యవేక్షించేవారు లేరు. దీంతో ఉపాధ్యాయులే స్కూల్ గదులు, టాయిలెట్స్‌ను శుభ్రం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల చందాలు వేసుకుని నెల వారీగా పనిచేసేందుకు ఒకరిని ఏర్పాటు చేసుకుంటున్నారు.

కరోనా వైరస్ భయాలతో స్కూళ్లకు వెళుతున్న టీచర్లకు కొత్తగా పారిశుధ్య పనులు కూడా చేయాల్సి వస్తోంది. స్కూళ్లలో పనిచేసేందుకు తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించేందుకు ప్రధానోపాధ్యాయులకు అధికారాలిస్తూ 2019 వరకూ ప్రతి ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేది. ఈ సారి అలాంటివేమీ జారీ చేయలేదు. స్కూళ్లలో శానిటేషన్, శుభ్రత పనులను గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తారని రాష్ట్ర సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు ఆగస్టు 28న ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ప్రతి రోజూ స్కూల్ పరిసరాలతో పాటు టాయిలెట్స్‌ను కూడా శుభ్రం చేస్తారని అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ పంచాయతీ కార్మికులు స్కూళ్ల వైపునకు చూడలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో ఆ పనులన్నీ టీచర్లే చేయాల్సి వస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది అకాడమిక్ ప్రారంభంలో టీచర్లు సీనియర్ స్టూడెంట్ల సహాయంతో తరగతి గదులను, ఆవరణను శుభ్రం చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విద్యార్థులు స్కూళ్లకు రావడం లేదు. ఆరు నెలలుగా తీయకపోవడంతో గదులన్నీ దుమ్ము, బూజుతో నిండిపోయాయి.

నీటి వసతి, టాయిలెట్స్‌ వినియోగంలోకి తేవాలంటే ఉపాధ్యాయులే కష్టపడాల్సి వస్తోంది. చదువు చెప్పే పాఠశాలల్లో పరిశుభ్ర పనులు చేయిస్తున్నారని ప్రభుత్వంపై టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ స్కూలే కావడంతో ఒక్క రోజంటే ఇబ్బందిగా ఉండదని, ప్రతి రోజూ స్కూల్స్ ఊడ్చటం, టాయిలెట్స్ శుభ్ర పరచాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. పాఠశాలలను శుభ్రం చేసే క్రమంలో శ్వాస, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలున్న టీచర్లు మరింతగా ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల వరకూ సర్వీస్ పర్సన్స్‌ అవసరముంది. వీరందరిని నియమించడం ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు పారిశుధ్య పనుల నుంచి మినహాయింపు కలిగించవచ్చు. మరో వైపు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రతి రోజూ స్కూళ్లను శుభ్రపరచడంతో పాటు శానిటైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ పనులు చేసేందుకు జీపీ కార్మికులు రావడం లేదు.

ఉపాధ్యాయులే పనులను తప్పనిసరిగా చేయాల్సి వస్తుండటంతో రెగ్యులర్ డ్యూటీలకు ఆటంకం కలుగుతోంది. రోజూ టాయిలెట్స్, రూమ్స్ క్లీన్ చేసుకోవడం ఉపాధ్యాయులను కొంత వేధిస్తోంది. దీంతో కొన్ని పాఠశాలల్లో టీచర్లే చందాలు వేసుకుని నెల వారీగా పనిచేసేందుకు మనుషుల్ని నియమించుకుంటున్నారు. స్కూల్ గదులు ఊడ్చటం చేస్తున్నా శానిటైజేషన్ పనులు చేపట్టడంపై వారికి అవగాహన ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం మాత్రమే వచ్చి వారు ఇతర పనుల కోసం వెళ్తున్నారు. ప్రభుత్వమే జీతమిచ్చి సర్వీస్ పర్సన్స్‌ను నియమించడం ద్వారా సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

సర్వీస్ పర్సన్స్‌ను నియమించాలి..

2019 వరకూ ప్రతి ఏడాది ప్రభుత్వం సర్వీస్ పర్సన్స్‌ను నియమించుకునేందుకు ఆర్డర్స్ ఇచ్చేది. ఈ ఏడాది ఇవ్వలేదు. జీపీ కార్మికులు వచ్చి స్కూళ్లను శుభ్రం చేస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే వారికి గ్రామంలోని పనులతోనే సరిపోతోంది. స్కూల్, జీపీ.. రెండింటి పనులను వారు చేయడం సాధ్యం కావడం లేదు. వారం రోజులుగా రోజూ స్కూళ్లను మేమే శుభ్రం చేసుకుంటున్నాం. గ్రామస్తుల సహకారంతో ఒక వ్యక్తిని నియమించుకోవాలని భావిస్తున్నాం.. ప్రభుత్వం నుంచి జీతాలేవీ ఉండవు. స్కూల్‌లో ఉన్న ముగ్గురం టీచర్లం కలిసి జీతం ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలి. స్కూల్ సర్వీస్ పర్సన్స్ నియమాకానికి అనుమతినివ్వాలి. – మహిపాల్ రెడ్డి, ఎస్‌జీటీ, మన్నెంపల్లి

స్కూల్ శుభ్రం చేసేందుకు వారం పట్టింది..

ఆరు నెలల నుంచి స్కూళ్లు మూసి ఉండడంతో పుస్తకాలు, ఫైళ్లు, టేబుళ్లు.. ఎక్కడ చూసినా దుమ్ముతో నిండిపోయాయి. గదులు, గోడలు అపరిశుభ్రంగా బూజు పట్టాయి. ఉన్నదే ఇద్దరు టీచర్లు.. సాయం చేయడానికి ఎవరూ లేరు. దీంతో రోజూ కొంత పని చేసుకుంటున్నాం.. స్కూల్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి వారం రోజులు పట్టింది. దుమ్ముతో చాలా ఇబ్బందులు పడ్డాం. రెండు రోజులు శ్వాస సమస్యలు వచ్చాయి. గతంలో అయితే గ్రామంలోని సీనియర్ విద్యార్థులు, వ్యక్తులు కొంత సాయం చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అన్ని స్కూళ్లలోనూ ఉపాధ్యాయులు ఈ పనులు చేయడానికే ఎక్కువ సమయం పోతుంది. – రూప్లా నాయక్, హైస్కూల్, మంచిర్యాల

Advertisement