జగన్ ప్రభుత్వం బర్తరఫ్.. ఎలాగో చెప్పిన దీపక్ రెడ్డి

by  |
deepak reddy mlc
X

దిశ, ఏపీ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల ముసుగులో జరిగిన అక్రమాలు, అరాచకాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. అదే జరిగితే జగన్ ప్రభుత్వం బర్తరఫ్ అవ్వడం ఖాయమని హెచ్చరించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై ఎంత ఒత్తిడి చేసినా ఆయన భయపడకుండా విచారణ జరిపించాలని సూచించారు. కొన్నినెలల్లో రిటైరయ్యే నిమ్మగడ్డ, నిజాయితీతో, నిష్పక్షపాతంతో, నిర్భయంగా వ్యవహరించి…స్థానిక ఎన్నికలు జరిపించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలను బయటపెడితే… నిమ్మగడ్డ పేరు దేశచరిత్రలో నిలిచిపోతుందన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని నేషనల్ మీడియా చెబుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నిమ్మగడ్డపై తప్పుడు కథనాలు ప్రచారం చేయిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన్ని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకొని తామనుకున్నది నెరవేర్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. హైకోర్టు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వేరు, ఎస్ఈసీ వేరని చెప్పిందన్నారు. ఎప్పుడూ బయటకు రాని ముఖ్యమంత్రి, నిమ్మగడ్డ కారణంగా ప్రెస్ మీట్ పెట్టారన్నారు. మంత్రులు అనిల్ కుమార్, పేర్నినాని, కొడాలి నానిలు గతంలో నిమ్మగడ్డపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడేం మాట్లాడుతారని ప్రశ్నించారు. శునకాన్ని కనకపు సింహాసనంపై కూర్చోబెట్టారని విజయసాయి అంటే, వెధవకు పదవి గాడిదకు పెత్తనం అని స్పీకర్ అన్నారని…వారి వ్యాఖ్యలు ఎవరికి వర్తిస్తాయో, ఇప్పుడు ఎస్ఈసీగా ఎవరున్నారో అర్థం చేసుకోవాలని ఎమ్మెల్సీ తెలిపారు.

ఏం చేసైనా సరే స్థానిక ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఇప్పటికే ఓట్ల తొలగింపు, పంచాయతీలను మున్సిపాలిటీల్లో కలపడం, నామినేషన్లు వేసేవారిని అడ్డుకోవడం, ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించడం, తప్పుడు కారణాలతో నామినేషన్లు తిరస్కరించడం, ప్రలోభాలకు గురిచేయడం, దాడికి పాల్పడటం, అక్రమ కేసులు పెట్టడం వంటివి చేశారని విమర్శించారు. వైసీపీనేతల్లా టీడీపీ నేతలు దిగజారి మాట్లారని తెలిపారు. నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలమైతే, టీడీపీ ఫిర్యాదులపై ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదని దీపక్ నిలదీశారు. కిందిస్థాయి అధికారులు దొంగలైపోయి, ప్రభుత్వంతో కలిసిపోయారని నిమ్మగడ్డకు ఆధారాలు చూపించాకే, ఆయన అధికారులపై చర్యలు తీసుకున్నారని అన్నారు. నిమ్మగడ్డ స్పందించడంతో, ప్రభుత్వం ఆయన్ని బెదిరించడం ప్రారంభించిందని తెలిపారు.

తనకు రక్షణ కావాలని నిమ్మగడ్డ, ఢిల్లీకి లేఖ రాస్తే… ఆ లేఖను కూడా విజయసాయి, తదితరులు తప్పుపట్టారని మండిపడ్డారు. రక్షకులుగా వ్యవహరించాల్సిన అధికారులే ప్రజలపట్ల భక్షకులుగా వ్యవహరించడం దారుణమన్నారు. పార్టీలకు అతీతంగా వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే తరాలకు ఇటువంటి వ్యవస్థను అప్పగిస్తే, వారు బతకడమే కష్టమవుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో 2,500 ఘటనలు జరిగినా చర్యలు లేవని… ఎమ్మెల్సీ దీపక్ పేర్కొన్నారు.


Next Story