టీసీఎస్ భారీ బైబ్యాక్

by Harish |
టీసీఎస్ భారీ బైబ్యాక్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) భారీ బైబ్యాక్‌ను ప్రకటించింది. ఈ బైబ్యాక్ విలువ సుమారు రూ. 16,000 కోట్లుగా భావిస్తున్నారు. ఈ నెల 18న మొదలై వచ్చే ఏడాది జనవరి 1కి ముగుస్తుంది. గత నెలలో టీసీఎస్ వాటాదారులు 5,33,33,333 వాటాలను బైబ్యాక్ చేసేందుకు అనుమతి ఇవ్వగా, దీనికోసం ఒక్క షేర్ ధరను రూ. 3 వేల వద్ద కొనుగోలు చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. సెబీ 2018 బైబ్యాక్ నిబంధనల ప్రకారం..అర్హులైన వాటాదారులకు ఆఫర్ లెటర్‌ను పంపించనున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 15 నాటికి పూర్తవనుంది. అలాగే, బైబ్యాక్‌కు సంబంధించి బిడ్‌ల పరిష్కారానికి తుది గడువును జనవరి 12గా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. వాటాదారులకు మూలధనాన్ని తిరిగివ్వాలనే సంస్థ విధానాలకు అనుగుణంగా బైబ్యాక్ చెపట్టినట్టు టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ చెప్పారు.

ప్రస్తుత టీసీఎస్ వద్ద సెప్టెంబర్ చివరి నాటికి రూ. 58 వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఇదివరకు ఓసారి బోనస్‌ను కంపెనీ ప్రకటించింది. అక్టోబర్‌లో ఈక్విటీ షేర్‌కు రూ. 40 స్పెషల్ డివిడెండ్‌ను అందించింది. తాజాగా, బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. కాగా, టీసీఎస్‌తో పాటు మరో దిగ్గజ ఐటీ సంస్థ విప్రో సైతం బైబ్యాక్ ఆఫర్‌ను ఇవ్వనుంది. మొత్తం 23.75 కోట్ల షేర్లను ఒక్కోదానికి రూ. 400తో రూ. 9,500 కోట్ల బైబ్యాంక్‌ను ప్రకటించింది. కంపెనీ చెల్లించిన ఈ మొత్తం కంపెనీ ఈక్విటీ మూలధనంలో 4 శాతం వాటాకు సమానం. కాగా, టీసీఎస్ సంస్థ ఇదివరకు ఇన్వెస్టర్ల కోసం బైబ్యాక్, ఉద్యోగులకు వేతన పెంపును అందించింది. 2017 తర్వాత టీసీఎస్ ప్రకటించిన మూడో అతిపెద్ద బైబ్యాక్ ఇదే కావడం గమనార్హం.

Advertisement

Next Story