మూడో త్రైమాసికంలో అదరగొట్టిన టీసీఎస్!

by Harish |
మూడో త్రైమాసికంలో అదరగొట్టిన టీసీఎస్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఐటీ ఎగుమతుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. అంచనాల స్థాయిలో నికర లాభాలు 7.18 శాతం పెరిగి రూ. 8,701 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 8,118 కోట్లుగా వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 5.42 శాతం పెరిగి రూ. 42,015 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికానికి రూ. 39,854 కోట్లుగా ఉంది. గత తొమ్మిదేళ్లలో ఇదే బలమైన మూడో త్రైమాసిక ఫలితాలని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ క్రమంలో ఒక్కో షేర్‌కు రూ. 6 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

కోర్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు కంపెనీ చేసుకున్న మునుపటి ఒప్పందాలతో బలమైన ఆదాయాలను సాధించగలిగామని టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. మార్కెట్లో కంపెనీ స్థానం ఇదివరకటి కంటే బలంగా ఉన్న సమయంలో కొత్త ఏడాదిలోకి ప్రవేశించామని ఆయన వెల్లడించారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రస్తుతం మార్కెట్ల నుంచి అందే అవకాశాలను సాధించేందుకు వీలవుతుందని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి రామకృష్ణన్ పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో కంపెనీ 15,721 ఉద్యోగులను చేర్చిందని కంపెనీ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed