- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కదలని TAXI.. వదలని EMI
కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టంపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. ముఖ్యంగా రోజు వారీగా వచ్చే డబ్బులతో ఇటు ఫైనాన్స్ కడుతూ అటు కుటుంబాన్ని పోషించుకునే ట్యాక్సీ డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కరోనా కారణంగా చాలా మంది ట్యాక్సీలు ఎక్కడం లేదని, సొంత వాహనాలకే మొగ్గు చూపుతున్నారని, దీంతో తాము గిరాకీలు లేక ఇతర పనులు చేసుకుంటున్నామని వారు వాపోతున్నారు.
దిశ ప్రతినిధి, మెదక్ : పేద, మద్య తరగతి కుటుంబాలను కరోనా ఆగం చేసింది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులను నిండా ముంచింది. డ్రైవింగ్‌ను నమ్ముకుని టాక్సీలు, జీపులు, కార్లు వ్యాన్‌లు నడుపుతూ జీవనం సాగించే వేలాది కుటుంబాలు నాలుగు నెలలుగా పూటగడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సొంత కష్టంపై ఆధారపడే వారు అప్పు చేసి కార్లు, జీపులు, వ్యాన్లు కొన్నవారు. వాటి ఫైనాన్స్ డబ్బులు తీర్చేందుకు ఇంట్లో ఉన్న బంగారం, వస్తువులు అమ్ముకుంటున్నారు. మరికొందరు కుటుంబపోషణ కోసం కూలీలుగా మారుతున్నారు. సాధారణ రోజుల్లో ఆదాయం రావడంతో కళకళలాడిన వారి బతుకులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో వెలవెలబోతున్నాయి. చాలా మంది తమ ప్రయాణాలు తగ్గించుకోవడం, సొంత వాహనాలనే ఉపయోగించడంతో కార్లు, ట్యాక్సీ, జీపుల డ్రైవర్లు పరిస్థితి దయనీయంగా మారింది. గిరాకీలు లేక, ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, సిద్దిపేటలో సూమారు 10 వేల మందికి పైగా ట్యాక్సీ డ్రైవింగ్ చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో హైదరాబాద్, కరీంనగర్‌తో పాటు వివిధ జిల్లాలకు, ప్రముఖ ఆలయాలకు ప్రతిరోజూ వేలాది మంది ప్రైవేటు టాక్సీలు, జీపులు, వ్యాన్‌లు వంటి వాహనాలపై ఆధారపడేవారు. కరోనా ప్రభావంతో 5 నెలలుగా ప్రయాణాలు లేక వేల సంఖ్యలో వాహనాలు మూలనపడ్డాయి. ఆ వాహనాలపై ఆధారపడి జీవించే డ్రైవర్లు వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే స్వంత వాహనాలు ఉండి డ్రైవర్‌గా కొనసాగేవారు నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల నికర ఆదాయం వచ్చేది. వాహనాలను అద్దె ప్రాతిపదికన తీసుకుని నడుపుకునేవారైతే నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు సంపాదించుకునేవారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో చాలా వరకు సడలింపులు వచ్చినా క్యాబ్, ట్యాక్సీ, జీపులను చాలా మంది ఆశ్రమయించడం లేదు.
కూలీలుగా..
పని లేక చాలా మంది డ్రైవర్లు కూలీలుగా మారారు. సిమెంట్ బస్తాలు మోస్తూ, పెయిటింగ్ పనులకు హెల్ప్ చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మరి కొందరు తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం డ్రైవర్లకిచ్చే తోడ్పాటు మాత్రం వాహనాల యజమానులకే లభిస్తోంది. నిబంధనలు విధించకుండా డ్రైవింగ్‌పై ఆధారపడి జీవించే వారికి నెలకు రూ.10 వేలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఎల్ఐసీ లోన్ తో ఇల్లు గడుస్తోంది
ఎల్‌ఐసీలో లోన్ తీసుకోవడంతో ప్రస్తుతం ఇల్లు గడుస్తోంది. సొంతంగా ఇన్నోవా వాహనం కొన్నాను. దానికి సంబంధించిన చెల్లింపులు, నిత్యావరసరాల కొనుగోలుకు డబ్బులు అవసరం. ప్రస్తుతానికి రూ.లక్ష లోన్ తీసుకుని దానితో నెట్టుకొస్తున్నా. తర్వాత పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. -రవి, డ్రైవర్
కూలికి పోతున్న..
దాదాపు 15 ఏండ్లుగా డ్రైవింగ్ వృత్తిలో కొనసాగుతున్నాను. నెలకు రూ.15పైగా ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం డ్రైవింగ్ పని లేకపోవడంతో కూలి పని చేసుకుంటున్నా. ఇంటి అద్దె, చిట్టి డబ్బులు, నా భార్య నరాల జబ్బుకు మందులు… వీటన్నింటికి డబ్బులు చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిమెంట్ బస్తాలు మోసే పని, పెయింటర్ కు సహాయకుడిగా పని చేస్తున్న. – శ్రీనివాస్, డ్రైవర్
బంగారం తాకట్టు పెట్టిన
ట్యాక్సీ యజమాని వద్ద రూ.15 వేల జీతానికి పనిచేస్తున్న. లాక్‌డౌన్‌తో గిరాకీలు రావడం లేదు. యజమాని సైతం తనకు తోచినంత సహాయం చేస్తున్నాడు. కానీ ఇంటి అద్దె, డ్వాక్రా సంఘాలకు చెల్లింపులు, ఇంటి సరుకులు ఇలా చాలా వాటికి డబ్బు అవసరం. వీటన్నింటి కోసం నా భార్య బంగారం తాకట్టు పెట్టాను. – సలీం, టాక్సీ డ్రైవర్