కార్ల నుంచి విమాన టికెట్ల వరకూ అన్నీ సూపర్‌ యాప్‌లోనే

by Harish |
కార్ల నుంచి విమాన టికెట్ల వరకూ అన్నీ సూపర్‌ యాప్‌లోనే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్ త్వరలో తీసుకురానున్న సూపర్‌ యాప్‌లో ఎలక్ట్రానిక్స్, కిరాణా, ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అన్ని విభాగాలను ఒకే చోటుకు తీసుకురానున్నట్టు సంస్థ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. టాటా గ్రూప్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన టాటా డిజిటల్ కింద సూపర్‌ యాప్‌ను తయారు చేస్తోంది. దీనికోసం టాటా గ్రూప్ ఇప్పటికే దేశీయ అతిపెద్ద ఆన్‌లైన్ కిరాణా స్టార్టప్ బిగ్‌బాస్కెట్, ఈ-ఫార్మసీ కంపెనీ 1ఎంజీలలో వాటాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ‘మా ప్రతి బ్రాండ్ 1-2 కోట్ల మంది వినియోగదారులకు సేవలను అందిస్తుంది. వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. టాటా బ్రాండ్లను మాత్రమే కాకుండా ఇంకా మరిన్ని సేవలని అందించనున్నామని’ చంద్రశేఖరన్ వివరించారు.

త్వరలో రాబోతున్న సూపార్ యాప్‌ను మరింత శక్తివంతం చేసేందుకు టాటా గ్రూప్ తన రిటైల్ కంపెనీలైన ట్రెంట్, ఇంఫినిటీ రిటైల్, టాటా కంజ్యూమర్ ప్రోడక్ట్స్, టైటాన్, వోల్టాస్ ఇంకా ఇతర ఆర్థిక ఉత్పత్తుల కంపెనీలు, టాటా కంపెనీలు, టాటా అసెట్ మేనేజ్‌మెంట్ ఇలా అన్నిటినీ ఒకే దగ్గరకు తీసుకురానుంది. అంతేకాకుండా టాటా మోటార్ కార్లను కూడా విక్రయించనున్నామని, టాటా రియల్టీ ప్లాట్లను విక్రయిస్తామన్నారు. అలాగే, విస్తారా, ఎయిర్ ఆసియా విమాన టికెట్లను విక్రయించనున్నట్టు, తాజ్ హోటల్ రూములను కూడా బుక్ చేసుకునే అవకాశముంటుందని పేర్కొన్నారు. అయితే, సూపర్ యాప్‌ లాంచ్‌కు సంబంధించి చంద్రశేఖరన్ స్పష్టత ఇవ్వలేదు. సూపర్ యాప్ ద్వారా వినియోగదారుల జీవితాలను సరళీకృతం చేయాలని సంస్థ భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story