టాటా మోటార్స్ నికర నష్టాలు రూ. 307 కోట్లు

by Harish |
టాటా మోటార్స్ నికర నష్టాలు రూ. 307 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ కంపెనీ రూ. 307.3 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 187.70 కోట్ల నష్టాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా మొత్తం ఆదాయం 18.19 శాతం తగ్గి రూ. 53,530 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 65,431.95 కోట్లుగా నమోదైంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా కర్మాగారాలు, కార్యాలయాలు మూసేయడంతో కంపెనీ గత ఆరు నెలల్లో గణనీయంగా ప్రభావితమైందని ఓ ప్రకటనలో టాటా మోటార్స్ తెలిపింది.

లాక్‌డౌన్ వల్ల సరఫరా వ్యవస్థలో సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు కంపెనీ పరిస్థితులను అధిగమిస్తూ వచ్చిందని పేర్కొంది. తొలి త్రైమాసికంలో కొవిడ్-19 ప్రభావం నుంచి అమ్మకాలు, ఆదాయాలు కోలుకోవడంతొ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) విభాగం లాభాల్లోకి తిరిగి వచ్చిందని టాటా మోటార్స్ పేర్కొంది. రెండో త్రైమాసికంలో జేఎల్ఆర్ రిటైల్ అమ్మకాలు 1,13,569 యూనిట్లతో 53.3 శాతం పెరిగాయని కంపెనీ వెల్లడించింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం ఈ త్రైమాసికంలో బలమైన వృద్ధిని కొనసాగించిందని, వాణిహ్య వాహనాల విభాగం క్రమంగా మెరుగుపడుతోందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఖర్చులు రూ. 114 కోట్లు పెరిగి రూ. 1,950 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది.



Next Story