మూడేళ్లలో రుణ రహిత సంస్థగా టాటా మోటార్స్!

by Harish |   ( Updated:2021-07-30 22:31:40.0  )
N.Chandrasekaran
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కరోనా మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొన్నప్పటికీ 2023-24 నాటికి రుణ రహిత సంస్థగా ఉంటుందని సంస్థ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. శుక్రవారం టాటా మోటార్స్ 76వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో మాట్లాడిన ఆయన ‘ గతేడాది కఠినమైన నిర్వహణ బాధ్యతల ద్వారా రూ. 7,500 కోట్ల రుణాలను తగ్గించగలిగాము. మరో మూడేళ్లలో రుణ రహిత సంస్థగా నిలవాలనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని’ చెప్పారు. 2020-21 చివరిలో టాటా మోటార్స్ రుణాలు రూ. 40,900 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి రుణాలు రూ. 61,300 కోట్లకు చేరుకున్నాయి. ప్రధానంగా మూలధన నిర్వహణ అవసరాల్లో మార్పుల ప్రభావంతో కంపెనీ రుణాలు పెరిగాయని ఆయన వివరించారు. ఆదాయం 4 శాతం క్షీణించి రూ. 2.5 లక్షల కోట్లకు చేరుకుందని’ ఛైర్మన్ తెలిపారు.

వ్యాపార పరంగా టాటా మోటార్స్ మూడు విభాగాలైన జాగ్వార్ ల్యాండ్ రోవర్, ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలు సానుకూలంగా ఉన్నాయని, ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల విభాగంలో గణనీయమైన రికవరీ కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోంది. టీకా పొందిన వారు పెరగడం, వినియోగదారుల ప్రాధాన్యత క్రమంలో మార్పులతో డిమాండ్ మరింత బలంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు చంద్రశేఖరన్ వాటాదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక, పరిశ్రమలో కీలక సవాలుగా మారిన సెమీకండక్టర్ల కొరత మరో 12-18 నెలల్లో సాధారణ స్థిరికి వచ్చే వీలుందన్నారు.

Advertisement

Next Story