టాటా గ్రూప్ నుంచి సూపర్‌యాప్!  

by Harish |   ( Updated:2020-08-24 05:00:18.0  )
టాటా గ్రూప్ నుంచి సూపర్‌యాప్!  
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ రంగం విపరీతమైన డిమాండ్‌ను సృష్టించుకుంది. ఇప్పటికే ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ (amazon), ఫ్లిప్‌కార్ట్ (flipkart) ‌లకు పోటీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (reliance industries) అత్యంత వేగంగా దూసుకొచ్చింది. తాజాగా దేశీయ మరో దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ (TATA group) సైతం సూపర్ యాప్‌ను రూపొందించేందుకు సిద్ధమైంది.

టాటాగ్రూప్ సంస్థ ఉప్పు దగ్గరినుంచి టీసీఎస్ వరకు అనేక రంగాల్లో విస్తరించిన సంగతి తెలిసిందే. గతేడాది టాటా డిజిటల్ (TATA digital) పేరున డిజిటల్ బిజినెస్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు చైనాలో ఆదరణ ఉన్న టెన్సెంట్ (Tencent), అలీబాబా (alibaba) లాంటి సూపర్‌యాప్‌ను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి తీసుకురావాలని, దీంతో రిలయన్స్, రిటైల్ దిగ్గజం అమెజాన్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ సూపర్‌యాప్ కోసం టాటా గ్రూప్ సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టడానికి ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ యాప్‌లో ప్రతి వస్తువును ఆర్డర్ చేసే విధంగా రూపొందిస్తున్నారు. అయితే, మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఫ్యాషన్ యాప్ టాటా క్లిక్ (tata cliq fashion app), కిరాణా ఈ-స్టోర్ స్టార్‌క్విక్ (starquik), ఎలక్ట్రానిక్స్ వేదిక క్రోమా ద్వారా టాటా గ్రూప్ సేవలను అందిస్తోంది. కొత్త యాప్‌తో సంస్థ బ్రాండింగ్‌ను మరింత పటిష్టం చేసే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఆహారం, కిరాణా, లైఫ్‌స్టైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, హెల్త్ కేర్ లాంటి వాటితో పాటు పేమెంట్ సేవలు కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల గోల్డ్‌మన్ శాచ్స్ నివేదికలో 2030 నాటికి భారత జీడీపీలో ఆన్‌లైన్ రిటైల్ విభాగం 2.5 శాతం వాటాను దక్కించుకోనుందనే నేపథ్యంలోనే టాటా ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story