టార్గెట్ హుజూరాబాద్.. విద్యార్థి జేఏసీ బస్సుయాత్రతో ఎటాక్!

by Anukaran |
Allam Narayana
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ టార్గెట్‌‌గా, ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ భారీ స్కెచ్ వేసింది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాలకు, గ్రామాలకు ఇన్‌చార్జులను నియమించిన టీఆర్ఎస్ ఇప్పుడు గ్రామగ్రామాన ప్రచారం చేసేందుకు విద్యార్థి జేఏసీ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. 7 బస్సుల్లో 100 మంది విద్యార్థులతో ఆ నియోజకవర్గంలోని 5 మండలాలు, 2 మున్సిపాలిటీలను కవర్ చేసేలా 20 రోజుల కార్యాచరణను పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ బస్సు యాత్రకు గన్ పార్కులోని అమరవీరుల స్మారక స్థూపం దగ్గర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు.

ఉస్మానియా వర్శిటీకి చెందిన పన్నెండు విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా యాత్ర చేపట్టనున్నాయి. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికే ఈ యాత్ర పరిమితం కానుంది. హుజూరాబాద్‌కు ఉప ఎన్నికల ఎందుకు వచ్చింది? ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారు? ఆయన స్వార్థ ప్రయోజనాలేంటి? అసైన్డ్ భూముల కబ్జా, ఆత్మగౌరవం నినాదం, బీజేపీతో జతకట్టడం లాంటి అనేక అంశాలను ఈ బస్సు యాత్ర సందర్భంగా విద్యార్థులు ఆయా గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యే తీరులో వివరించనున్నారు. ఏడేళ్ల స్వయం పాలనలో యువతకు వచ్చిన ఉద్యోగాలు, టీఆర్ఎస్ ఎన్నికల హామీల అమలు తదితర అంశాలను కూడా ప్రస్తావించనున్నారు.

టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించడంతో పాటు కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎండగట్టడం ఈ యాత్ర ఉద్దేశం. ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఆ పార్టీపైనే బాణం ఎక్కు పెట్టాలనుకుంటున్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన ఎజెండా ప్రకారం ఈ యాత్ర జరగనున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం, బ్యాంకుల దివాలా, నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం, వ్యవసాయ మార్కెట్ల నిర్వీర్యం, ఎరువుల రాయితీల తొలగింపు, కార్పొరేట్ సంస్థలకు లాభాలు కల్పించడం, వంట గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు, కరోనా వ్యాప్తిలో వైఫల్యం తదితరాలను ప్రస్తావించడం ద్వారా బీజేపీని టార్గెట్ చేయాలన్నది ఈ యాత్రలో మరో ప్రధాన ఉద్దేశం.

కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణకు అన్యాయం : అల్లం నారాయణ

కేంద్రం అవలంభిస్తున్న విధానాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని మీడియా అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ వ్యాఖ్యానించారు. బస్సు యాత్రను ప్రారింభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు కీలకంగా పనిచేశారని, తాజాగా కృష్ణాజలాలపై విడుదల చేసిన గెజిట్ తెలంగాణ పట్ల వివక్ష చూపడమేనని అన్నారు. నీటి హక్కుల కోసం స్వరాష్ట్రాన్ని కోరుకుంటే ఇప్పుడు దానికే ఎసరు వచ్చిందన్నారు. మోడీ సర్కార్ విచ్ఛిన్న తరహా పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ పంచ సూత్రాలకు అనుగుణంగా కేంద్రం పాలన సాగిస్తున్నదని, రిజర్వేషన్ల హక్కులను కాలరాస్తున్నదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డివిరుస్తున్నదని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారం ఉక్కు, కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ రావాల్సి ఉన్నా చొరవ తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ, హుజూరాబాద్ నుండే విద్యార్థి విభాగం పోరుబాట పట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు.

Advertisement

Next Story