‘కులం పేరుతో పిలిచే… నీచమైన పాలన సాగింది’

by  |
‘కులం పేరుతో పిలిచే… నీచమైన పాలన సాగింది’
X

దిశ, హుస్నాబాద్: భూమిపై హక్కులు కల్పించింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం వీరబైరాన్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అమరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తితో పాటు ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిందన్నారు. భూస్వామ్య పెత్తందార్లు, జమీందార్లు, జాగీర్దార్లు గ్రామాల్లోని ప్రజల భూములు లాక్కొవడం, వెట్టిచాకిరి చేయించడమే కాకుండా చేతి వృత్తులను కులం పేరుతో ప్రజలను పిలిచే నీచమైన రాచరిక పాలన సాగిందన్నారు.

నిజాం రజాకార్లు గ్రామాల్లో దాడులు చేస్తూ, దోచుకుపోవడమే కాకుండా మహిళలను చిత్రహింసలకు గురి చేయడం, అడ్డొచ్చిన వారిని హత్యలు చేశారని తెలిపారు. వారి అగడాలు రోజురోజుకూ మితిమీరడంతో, అడ్డుకట్టవేయాలనే సంకల్పంతో గ్రామాలన్నీ ఏకతాటిపైకొచ్చి రైతాంగ సాయధ పోరాటానికి పూనుకున్నాయన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం హిందూ, ముస్లింలకు మధ్య జరిగిన పోరాటమని బీజేపీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడువేల గ్రామాలను నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించడంతో పాటు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ, 4 వేల మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలను అర్పించారన్నారు. బీజేపీ నాయకులు రైతాంగ సాయుధ పోరాట చరిత్రను రాజకీయ లబ్ధికోసం వక్రీకర్తిస్తూ నేడు పబ్బంగడుపుతుందని మండిపడ్డారు. బీజేపీ నాయకులకు దేవాలయాల మీద, రాముడి మీద భక్తి కోసమో కాదని ఢిల్లీపీఠం మీదున్న ఆశతో మాత్రమే హిందూ, ముస్లీం పోరాటం సాగిందంటూ ప్రచారం చేస్తూ నిజమైన భక్తిలేనివారిగా ప్రజల్లో మిగిలిపోతారని విరుచుకుపడ్డారు.



Next Story

Most Viewed