‘బీజేపీకి తలొగ్గితే టీఆర్ఎస్ పతనం ఖాయం’

by Shyam |
‘బీజేపీకి తలొగ్గితే టీఆర్ఎస్ పతనం ఖాయం’
X

దిశ, మునుగోడు: మోడీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న కేసీఆర్.. ఆయనకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఎలా పెడతాడో ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) పార్టీ విస్తృతస్థాయి సమావేశం చౌటుప్పల్లోని గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తమ్మినేని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి తర్వాత మద్దతు తెలపడం దురదృష్టకరమన్నారు. బీజేపీ బెదిరింపులకు, ప్రలోభాలకు టీఆర్ఎస్ తలొగ్గితే రాష్ట్రంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకం కాక తప్పదని హెచ్చరించారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి చెల్లిస్తానన్న కేసీఆర్ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అన్న ముఖ్యమంత్రి తన పాలనతో అప్పుల రాష్ట్రంగా మార్చాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారితే రాష్ట్రంలో మత ఘర్షణలు తప్పవని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాబోయే రోజులు కమ్యూనిస్టులవేనని, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం ముగిసిందని ప్రచారం చేస్తున్న వారికి అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమే ఉదాహరణ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఫైళ్ల ఆశయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story