పక్షి పిల్లల కోసం అంధకారంలో ఓ గ్రామం

by  |
పక్షి పిల్లల కోసం అంధకారంలో ఓ గ్రామం
X

దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్ వల్ల గ్రామాలు, పట్ణణాలు, నగరాలన్నీ ప్రశాంతంగా మారడంతో రకరకాల పక్షులు జనావాసాల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త కొత్త పక్షులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వాటికోసం మనం కూడా బాల్కనీల్లో, గోడలపైన ఏదైనా ఆహారంతో పాటు నీళ్లు పెడుతుంటాం. అయితే, త‌మిళ‌నాడు శివగంగ జిల్లాలోని పొత్తకూడి గ్రామ ప్రజలు ఓ పక్షిని, దాని పిల్లలను కాపాడటం కోసం ఏకంగా 35 రోజులుగా గ్రామంలో లైట్లు వేసుకోలేదు. దీంతో ఊళ్లోని వీధులన్నీ అంధకారంలోనే ఉండిపోయాయి. ఇంతకీ పక్షిని రక్షించడానికి, లైట్లు వేసుకోకపోవడానికి కారణం ఏంటో? తెలుసుకోండి.

అన్ని గ్రామాల్లోకి భిన్న జాతులకు చెందిన పక్షులు వలసొస్తున్నట్లే.. పొత్తకూడి గ్రామానికి కూడా కొన్ని రోజుల కిందట ‘ఇండియన్ రాబిన్’ అనే పక్షి జంట వచ్చింది. ఆ పక్షులు గ్రామానికి వీధిలైట్లు ఆన్ చేసే మెయిన్ స్విచ్ బోర్డు దగ్గర ఆడుకుంటూ ఉండేవి. అవి అక్కడే గూడు కట్టుకోవడాన్ని గ్రామానికి చెందిన కరుప్పురాజా అనే విద్యార్థి గమనిస్తుండేవాడు. కాగా, రోజూ లాగే లైట్లు ఆన్ చేసేందుకు ఓ గ్రామ‌స్తుడు అక్క‌డికి రాగానే.. ప‌క్షులు టెన్ష‌న్ ప‌డ‌టాన్ని రాజా గ‌మ‌నించాడు. దీంతో ఆ పక్షులు ఎందుకలా ప్రవర్తించాయో తెలుసుకునేందుకు అక్కడికెళ్లాడు.

ఆ గూడులోకి చూడగానే.. ఆ పక్షి మూడు గుడ్లను పెట్టిన విషయం రాజాకు అర్థమైంది. దీంతో తన స్నేహితులతో కలిసి ఎలాగైనా.. ఆ పక్షి పిల్లల్ని కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆ పక్షి గుడ్లు పొదిగే వరకు వీధి లైట్లు వేయకూడదని ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులందరికీ ఈ విషయాన్ని వివరించారు. కొందరు వెంటనే అంగీకరించగా.. మరికొందరు మాత్రం ఓ పక్షి కోసం ఇది అవసరమా అన్నట్లు మాట్లాడారు. కానీ చివరకు ఎలాగోలా గ్రామస్తులందరూ ఒకే మాటకు కట్టుబడి వీధి లైట్లు వేయకూడదని నిర్ణయించారు. ఇలా 35 రోజులుగా రాత్రి పూట వీధుల్లో నడవడానికి టార్చిలైట్లు, ఫ్లాష్ లైట్లు మాత్రమే ఉపయోగిస్తూ మొత్తానికి వాళ్లనుకున్నది సాధించారు. మూడు ‘రాబిన్’ పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చి కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి ఎగిరిపోయాయి. దాంతో రాజా అతని స్నేహితులు, ఆ గూడును క్లీన్ చేసి, మళ్లీ గ్రామానికి వెలుగులు అందించారు.

కరోనా సయమంలో సాటి మనిషిపైనే ‘ప్రేమ, సానుభూతి’ కరువైన ఈ రోజుల్లో.. పక్షి పిల్లల కోసం గ్రామస్తులు చేసిన ఈ పని నిజంగా అభినందనీయం. ప్రకృతి అంటే.. మనుషులతో పాటు, పక్షులు, జంతువులు, మొక్కలు.. సర్వజీవరాశులతో కలిసి జీవించడమేనని, ఈ పుడమి ఏ ఒక్కరి సొత్తు కాదని పొత్తకూడి గ్రామస్తులు నిరూపించారు.


Next Story

Most Viewed