‘డిసిన్ఫెక్షన్ టన్నెల్స్’ను ఉపయోగిస్తున్న తమిళనాడు.. త్వరలో తెలంగాణాలో వచ్చే అవకాశం

by  |
‘డిసిన్ఫెక్షన్ టన్నెల్స్’ను ఉపయోగిస్తున్న తమిళనాడు.. త్వరలో తెలంగాణాలో వచ్చే అవకాశం
X

దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల ప్రయత్నం చేస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ నిత్యవసర వస్తువుల కోసం మార్కెట్లకు వెళ్లక తప్పడం లేదు. ఇది కూడా ప్రజలకు ప్రమాదకరమేనని భావించిన తమిళనాడు ప్రభుత్వం.. తిరుపుర్‌లోని తెన్నాం పాల్యం మార్కెట్లో ‘డిసిన్ఫెక్షన్ టన్నెల్స్’ను ఏర్పాటు చేసింది. సుమారు 16 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఈ టన్నెల్‌ నిర్మించారు. దానికి రెండు సెట్ల స్ప్రేయర్లను అమర్చారు. ఒక్కో సెట్‌కు మూడు నాజిల్స్‌ ఉంటాయి. వాటి ద్వారా కరోనా వైరస్‌ను నాశనం చేసే ‘సోడియం హైపోక్లోరైట్‌’ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చేవారంతా ముందు అక్కడ ఏర్పాటుచేసిన వాష్‌బేసిన్ల వద్ద సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఆ తరువాత ఈ టన్నెల్‌ గుండా చేతులు రెండు పైకెత్తి నడుచుకుంటూ వెళ్లాలి. వారిపై సుమారు ఐదు సెకన్లపాటు హైపోక్లోరైట్‌ ద్రావణం వెదజల్లుతారు. దీనివల్ల వారి శరీరంపై ఏమైనా వైరస్ ఉన్నట్లయితే నశిస్తాయని అధికారులు చెబుతున్నారు.

కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతూ.. ప్రజల్లో భయాందోళనను సృష్టిస్తోంది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. ముందు జాగ్రత్తలపైనే అందరూ దృష్టి పెట్టారు. డాక్టర్లు సూచిస్తున్నట్లు, ప్రభుత్వాలు చెప్పినట్లు ప్రజలంతా పాటిస్తూ.. కరోనా రాకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. ఏదీ ఏమైనా.. నిత్య వసరాల వస్తువుల కోసమైనా.. బజారుకు వెళ్లి రావాల్సిన పరిస్థితి. ఆ సమయంలోనూ ప్రభుత్వాలు చాలా జాగ్ర్తత్తలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే.. తమిళనాడు రాష్ట్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకువేసింది. అక్కడ తిర్పూర్‌ జిల్లాలో మార్కెట్ల ముందు ‘కరోనా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌’ ఏర్పాటుచేశారు. దాంతో శరీరంపై కరోనా వైరస్‌ ఏమైనా వుంటే చనిపోతుంది. ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ ద్రావణం కంట్లో పడినా మంట పుట్టదు. ఆ విధంగా దానిని ఒక శాతం సోడియం హైపోక్లోరైట్‌ 1 పీపీఎం (పార్ట్స్‌ పెర్‌ మిలియన్‌)తో తయారుచేశారు. దీనిని అక్కడి వైద్యులు పరీక్షించి.. ఆ ద్రావనంతో ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని తెలియజేశారు. ఈ టన్నెల్‌ తయారీకి భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కి చెందిన యంగ్‌ ఇండియన్స్‌ విభాగం సహకారం అందిం చింది. ఒక టన్నెల్‌ తయారీకి సుమారు రూ.90 వేలు వ్యయం అయింది. ఈ మొత్తానికి వేయి లీటర్ల ద్రావణం వస్తుంది. దాంతో 16 గంటల పాటు నిరంతరం పిచికారీ చేయవచ్చు. గంటకు 50 లీటర్లు వినియోగమవుతోంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తమిళనాడులోని ఇతర జిల్లాల్లోను వీటి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.

తెలంగాణలో ఏర్పాటుకు ప్రయత్నాలు:

తమిళనాడులో ఏర్పాటు ‘కరోనా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌’ గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఇటువంటి మెషిన్లను వినియోగిస్తున్నారు. అయితే బి.చైతన్య అనే ట్విట్టర్ యూజర్ ‘కరోనా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌’ల గురించి .. మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆ ట్వీట్‌ను తెలంగాణ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తో షేర్ చేసుకున్నారు. దీనిపై హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులతో మాట్లాడాలని కోరారు. ఈ నేపథ్యంలో త్వరలో డిసిన్ఫెక్షన్ టన్నెళ్లు తెలంగాణలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags: corona virus, disinfection tunnel, tamilnadu govt, telangana govt,ktr,minister,jayesh ranjan



Next Story

Most Viewed