నిండుకుండలా ‘తాలిపేరు’.. ఆనందంలో అన్నదాతలు

by Sridhar Babu |
taliperu
X

దిశ, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటిని అంచనా వేస్తూ ప్రస్తుతం 4 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 2695 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదులుతున్నారు. వరద పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంత వాగువంకల నుంచి తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి 2,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు డీఈఈ తిరుపతి తెలిపారు.74 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన తాలిపేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 73.14 మీటర్ల నీరు నిల్వ చేస్తూ అదనపు నీటిని విడుదల చేస్తున్నారు.

తాలిపేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఆధారంగా చర్ల, దుమ్మగూడెం మండలాలు కలుపుకుని సుమారు 25 వేల ఎకరాల్లో వానాకాలం (ఖరీఫ్) పంట పండిస్తారు. వాటర్ క్యాచ్‌మెంట్ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించడంతో ఏడాది పొడవునా డ్యామ్‌లోకి నీరు వస్తుంటుంది. ప్రాజెక్టు ఒకసారి నిండితే వానలు పడకపోయినా ఒక పంట నీటికి ఢోకా ఉండదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిండుకుండలా దర్శనమిస్తున్న తాలిపేరు ప్రాజెక్టు వద్ద పర్యాటకుల తాకిడి సైతం పెరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed