మర్చిపోయిన దుస్తులతో మోడలింగ్

by  |
మర్చిపోయిన దుస్తులతో మోడలింగ్
X

తైవాన్‌కు చెందిన చాంగ్ వాన్‌జీ, సూ సుయైలు భార్యభర్తలు. గత 70 ఏళ్లుగా లాండ్రీ వ్యాపారం చేస్తున్నారు. మధ్య తైవాన్‌లోని తైచుంగ్ నగరంలో వారి లాండ్రీ దుకాణం చాలా ఫేమస్. అయితే కొందరు మంచి మంచి దుస్తులను వారి దగ్గర లాండ్రీకిచ్చి తీసుకెళ్లడం మర్చిపోతుంటారు. అలా వదిలేసిన దుస్తులు మొత్తం ఒక గుట్టలాగా పేరుకుపోయాయి. ఈ మధ్యే వాటిని వాళ్ల మనమడు రీఫ్ చాంగ్ చూశాడు. వాటిని చూడగానే రీఫ్‌కు ఒక ఐడియా వచ్చింది. అవి చాలా మంచి మంచి దుస్తులు, వాటిని మోడలింగ్ కోసం ఉపయోగించవచ్చని అనుకున్నాడు. అయితే ఈ కరోనా కాలంలో మోడల్స్ కావాలంటే దొరకడం కష్టం. దీంతో బాగా ఆలోచించి తన తాతా అమ్మమ్మలనే మోడల్స్‌గా చేయాలనుకున్నాడు. అంతే వారికి ఆ దుస్తులు వేసి మంచి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు.

ఇప్పుడు ఆ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎంతలా అంటే ఈ ఫొటోలు పెట్టిన ఒక్క రోజులో రీఫ్ ఇన్‌స్టాగ్రాం ఫాలోవర్లు లక్ష దాటేశారు. అంతేకాకుండా వారికి మోడలింగ్ ఆఫర్ల గురించి కూడా కాల్స్ వస్తున్నాయట. తమ వాళ్లని ఫేమస్ చేయడానికి తాను ఇలా చేయలేదని, వృద్ధాప్యంలో వారికి కొత్తదనాన్ని రుచి చూపించడానికి తాను ఈ ప్రయత్నం చేసినట్లు రీఫ్ అంటున్నాడు. అయితే ఇలా దుస్తులు ధరించి ఫొటోలు దిగగానే తమ వయస్సు 30 ఏళ్లకు తగ్గినట్లుగా అనిపిస్తోందని చాంగ్, సూలు అంటున్నారు. మోడలింగ్ ఆఫర్లు మాత్రమే కాకుండా తమ లాండ్రీ దుకాణానికి ఎన్నడూ లేని పబ్లిసిటీ కూడా వస్తోందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed