తైవాన్‌లో విమానాల ఆట!

by  |
తైవాన్‌లో విమానాల ఆట!
X

చిన్నపిల్లలు బొమ్మ కార్లు, బస్సులతో మంచి మంచి ఆటలు ఆడుకుంటారు. అందులో ఎక్కినట్లు, వేరే ప్రదేశానికి చేరుకున్నట్లు, పెట్రోల్ కొట్టించినట్లు, టికెట్ తీసుకున్నట్లు ఆయా ఆటల్లో నటిస్తారు. అచ్చం అలాంటిదే తైవాన్‌లోనూ జరిగింది. అయితే అక్కడ ఆడింది పిల్లలు కాదు, అవి బొమ్మ కార్లు కాదు. వాళ్లు ఆడింది విమానం ఆట. అర్థం కాలేదా? అయితే చదవండి. కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రపంచంలో అన్ని దేశాలు అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నిలిపేసిన సంగతి విదితమే! అయితే వేరే దేశాలకు ప్రయాణిస్తూ, ఎప్పుడూ ఒకచోట నిలకడగా ఉండలేని ప్రయాణ ఔత్సాహికులందరూ ఈ లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. వారి కోసమే తైవాన్‌లో తైపీలో సాంగ్షన్ విమానాశ్రయం వారు ఒక వినూత్న ఈవెంట్‌ను ప్రారంభించారు.

ఈ ఈవెంట్‌లో సాధారణ రోజుల మాదిరిగానే ప్రయాణికులు విమాన టిక్కెట్టు కొని విమానాశ్రయానికి వచ్చి విమానం ఎక్కాల్సి ఉంటుంది. ఒక గంటసేపు అందులో కూర్చున్న తర్వాత దిగి వెళ్లిపోవాలి. అంతే తప్ప ఆ విమానం ఎయిర్‌పోర్టు నుంచి ఒక్క అడుగు కూడా కదలదు. అయితే ఆ విమానాన్ని చేరుకోవడానికి ముందు జరిగే సెక్యూరిటీ చెక్, ఇమ్మిగ్రేషన్ చెక్.. ఇలా అన్నీ సాధారణంగానే ఉంటాయి. ఈ ఈవెంట్ కోసం 7000 మంది దరఖాస్తులు చేసుకోగా.. సామాజిక దూరం దృష్ట్యా వారిలో 60 మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీరందరూ చైనా ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక గంటసేపు టైంపాస్ చేసి వెళ్లిపోయారు. అయితే లాక్‌డౌన్ కాలంలో తాము విమానాశ్రయంలో చేసిన అభివృద్ధిని, కల్పిస్తున్న సురక్షణ సదుపాయాలను అందరికీ తెలిసేలా చేయడానికే ఈ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు విమానశ్రాయ సిబ్బంది తెలిపారు. ఏదేమైనా ఎన్నాళ్లో వేచి ఉన్న ట్రావెలింగ్ అనుభూతిలో కొంచెమైనా దొరికినందుకు ప్రయాణప్రియులు సంతోషిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇలాంటి ఈవెంట్లు మరికొన్ని ప్లాన్ చేస్తామని విమానాశ్రయ యాజమాన్యం వెల్లడించింది.



Next Story