వలస కార్మికులపై కేసులు ఉపసంహరించుకోండి : సుప్రీం

by Shamantha N |   ( Updated:2020-06-09 05:44:28.0  )
వలస కార్మికులపై కేసులు ఉపసంహరించుకోండి : సుప్రీం
X

న్యూఢిల్లీ: వలస కార్మికులపై పెట్టిన లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. స్వస్థలాలకు వెళ్లాలనుకొనే వలస కార్మికులను గుర్తించాలని, అందుకు అవసరమైన రవాణా సదుపాయాలను కల్పించాలని సూచించింది. ఈ ప్రక్రియను 15రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మార్చి 25న దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపాధి కరువై, తినడానికి తిండి కూడా లేకపోవడంతో వలస కార్మికులు సొంత ఊళ్లకు తిరుగు పయణమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులపై కేసులు నమోదు చేశాయి. వీటిపై మంగళవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వినతులు వచ్చిన 24గంటల్లోగా శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ ఆదేశించింది. మిగిలిన వలస కార్మికులను తరలించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 171 శ్రామిక్ రైళ్లు కావాలని కోరాయని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వలస కార్మికులకు ఆహారం, ఉపాధి, ఇతర సౌకర్యాల కల్పనపై ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాల వివరాలను సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను త్రిసభ్య ధర్మాసనం కోరింది.

‘స్వరాష్ట్రాలకు చేరుకున్న వలస కార్మికులతో కూడిన జాబితాను రూపొందించండి. అంతకుముందు ఎక్కడ పనిచేశారు అనే వివరాలను అందులో ఉండాలి. లాక్‌డౌన్ తర్వాత వలస కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ప్రత్యేకంగా పథకాలను ప్రవేశపెట్టాలి. స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికులను ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకాల ద్వారా ఉపాధి కల్పించాలి. తిరిగి పనిప్రదేశాలకు వెళ్లాలనుకొనే వలస కార్మికుల జాబితాను సిద్ధం చేయాలి. వారు పనిలో చేరే ముందు కౌన్సిలింగ్ నిర్వహించాలి’ అని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story