Health tips: వేసవి తాపం.. ఈ పానీయాలతో పొందండి ఉపశమనం

by sudharani |   ( Updated:2021-05-24 22:35:36.0  )
Health tips: వేసవి తాపం.. ఈ పానీయాలతో పొందండి ఉపశమనం
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి కాలం వచ్చేసింది. ఇంట్లో నుండి కాలు బయటపెట్టడం ఆలస్యం భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక బయట పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి అలిసిపోవడం ఖాయం. ఈ వేడికి తట్టుకోలేక డీహైడ్రే షన్, కళ్లు తిరగడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎండాకాలంలో చలువ చేసే పదార్దాలు, పానీయాలు తాగాలని చెప్తారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక రోడ్డు మీద ఏది పడితే అది తాగుతున్నారా? అయితే అనారోగ్యాన్ని మీరంతట మిరే కొని తెచ్చుకున్నట్లే. అందుకే ఆరోగ్యంగా ఇంట్లోనే చలువ చేసే పానీయాలను తాగుతూ ఈ వేసవి నుండి ఉపశమనం పొందండి.

సబ్జా గింజల పానీయం(Sabja Seeds drink)

ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మర్చిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు. ఈ గింజల్లో మహిళలకు కావల్సిన ఫోలేట్ తో పాటు అందాన్ని ఇనుమడింపజేసే విటమిన్ “ఇ” విటమిన్ అధికంగా ఉంటుంది. వీటిని తాగడం వలన అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. నానబెట్టిన సబ్జా గింజలను, గ్లాసు నీళ్లలో పంచదార వేసుకొని తాగాలి. ఇష్టమున్న వారు అందులో నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు.

నిమ్మ – పుదీనా పానీయం(Lemon – mint drink)

ఇక వేసవి అంటే అందరికి గుర్తొచ్చేది నిమ్మ సోడా. బయట సోడాలు దొరక్కపోతే ఎంచక్కా ఇంట్లోనే నిమ్మకాయ నీళ్లలో పంచదార కలుపుకొని కాసిన్ని ఐస్ ముక్కలు వేసుకొని తాగేస్తూ వేసవి తాపం ను తీర్చుకుంటారు. అయితే ఈసారి ఈ నిమ్మరసం లోకి కొద్దిగా పుదీనా ను కూడా యాడ్ చేసుకోండి.ఒక గ్లాసు నిమ్మ-పుదీనా జ్యూస్ తీసుకుంటే 76 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. అంతేకాకుండా దీనిలోని 40 గ్రా. సోడియం, 20.1 గ్రా. కార్బోహైడ్రేట్స్ శరీరానికి మేలు చేస్తాయి. దీని ద్వారా శరీరంలో ఉన్న వేడి ఇట్టే మాయమవుతుంది.

పుచ్చకాయ జ్యూస్(Watermelon juice)

ఎండాకాలంలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కాయ .. పుచ్చకాయ. వేసవిలో చలువ చేసే పదార్దాల్లో పుచ్చకాయ ముందు ఉంటుంది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. అంతేకాకుండా పుచ్చకాయలో కొలస్ట్రాల్ ఉండదు. ఎప్పుడు పుచ్చకాయ ను ముక్కలుగా తినడం కాకుండా దాంతో జ్యూస్ చేసుకొని తాగితే అధిక ప్రోటీన్లు లభిస్తాయి. చాలా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయ ముక్కలను విత్తనాలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మ రసం, కొద్దిగా దానిమ్మ గింజలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ రసాన్ని ఒక గ్లాసులో పోసి పుదీనా, ఐస్ ముక్కలు వేసి తాగాలి. ఈ వాటర్ మిలన్ చిల్లర అటు పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు.

ఆరెంజ్ జ్యూస్(Orange juice)

వేసవిలో చలువ చేసే పానీయాల్లో మరొకటి ఆరెంజ్ జ్యూస్. మార్కెట్ లో ఎన్నో కృత్రిమ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటిని పక్కన పెట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. ఇక ఎంతో రుచిగా ఉండే ఈ జ్యూస్ లో కార్బో హైడ్రేట్స్, ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆరెంజ్ లో జీరో కొలస్ట్రాల్ ఉంటుంది. దీని వలన డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎండలో బాగా ఎక్కువ కష్టపడేవారికి ఈ జ్యూస్ ఎంతో మేలుచేస్తుంది. ఒక గ్లాసు ఆరెంజ్ స్పోర్ట్స్ డ్రింక్ తాగితే 61 కేలరీల శక్తి అందుతుంది. 162 మిల్లీ గ్రాముల సోడియం, 15.3 కార్బోహైడ్రేట్స్ మీ శరీరానికి అందుతాయి. గ్లాసులో కొంచెం మంచి నీళ్లు తీసుకొని దానికి ఒక నారింజ పండు జ్యూస్‌, ఒక నిమ్మకాయ రసాన్ని కలపండి. ఆ తర్వాత దాన్ని ఫ్రిజ్ లో పెట్టి చల్లబడ్డాక సేవించండి.

ఇంకా వీటితో పాటు రోజు మజ్జిగ, రాగి జావ, ఎక్కువ మోతాదు లో నీళ్లు తాగడం వలన వేసవి తాపం నుండి ఉపశమనం పొందవచ్చు.

Advertisement

Next Story