కరీంనగర్ లో జైనుల ఉనికి.. మరోసారి వెలుగులోకి

by Sridhar Babu |
కరీంనగర్ లో జైనుల ఉనికి.. మరోసారి వెలుగులోకి
X

దిశ, కరీంనగర్: శతాబ్ధాల చరిత్రను తనలో దాచుకున్న కరీంనగర్ జిల్లాలో జైనుల ఉనికి మరోసారి బయటపడింది. 6వ శతాబ్ధానికి చెందిన జైనుల 24వ తీర్థంకురుడు, జైన మత వ్యాప్తి కోసం విశేషంగా కృషి చేసిన అతడి విగ్రహాలు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నృసింహునిపల్లిలో ఒగ్గు అంజయ్య అనే రైతుకు చెందిన భూమిని ట్రాక్టర్ తో దున్నుతుండగా వర్తమాన మహావీరుని విగ్రహం బయటపడింది. రెండేళ్ల క్రితం కూడా దుక్కి దున్నుతుండగా తీర్థంకరుని విగ్రహం బయటపడగా ఇప్పుడ మరో విగ్రహం కూడా బయటపడడం విశేషం. దీంతో జైనులు క్రీస్తు పూర్వం 6 శతాబ్ధంలోనే ఇక్కడ సంచరించినట్టు స్పష్టం అవుంతోంది. బీహార్ లోని వైశాలికి సమీపములో కుండ గ్రామంలో క్రీస్తు పూర్వం 599వ సంవత్సరంలో క్షత్రియ కుటుంబానికి చెందిన సిద్దార్ధ మహారాజుకు, రాణి త్రిషలకు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. మహావీరుడు తల్లి దండ్రులు 28వ ఏట మరణించగా, యశోధరను వివాహమాడి ఓ కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించాడు. 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడుగా జైనమత ప్రచారకుడయ్యాడు. అప్పటికే జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే జైనమత వ్యాప్తి విస్తృతంగా జరిగింది. 32 ఏళ్ళ పాటు అహింసా ధర్మంతో ప్రచారం జరిపిన మహావీరుడు 72వ ఏట మరణించారు. అయితే క్రీ.పూ. 6వ శతాబ్ధానికి చెందిన వర్తమాన మహవీరునికి సంబంధించిన విగ్రహాలు లభ్యం అయ్యాయంటే క్రీ.పూ 5 లేదా 4 శతాబ్దానికి చెందినవారు ఈ విగ్రహాలు స్థాపించి ఉంటారని భావిస్తున్నారు. నృసింహులపల్లికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మలగుట్ట వద్ద క్రీస్తు శకం 9వ శతాబ్ధానికి చెందిన ఆనవాళ్లు ఉన్నాయంటే ఈ ప్రాంతంలో జైనులు సంవత్సరాల పాటు సంచరించినట్టు స్పష్టం అవుతోంది. ఇలాంటి అత్యంత అరుదైన ఘనచరితను తనలో దాచుకున్న కరీంనగర్ నేపథ్యాన్ని భావితరాలకు అందిచేందుకు చరిత్రకారులు లోతైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed