- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కంటైన్‌మెంట్’లలోనే ఇకముందు లాక్‌డౌన్!
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 18వ తేదీ తర్వాత ఎలాంటి సడలింపులుంటాయి? ఎటువంటి విధానంలో లాక్‌డౌన్ అమలవుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లాక్‌డౌన్ 4.0 సరికొత్తగా ఉంటుందని ప్రధాని మంగళవారం చెప్పిన తర్వాత ఈ ఆసక్తి మరింత పెరిగింది. దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తేసే వ్యూహాన్ని అనుసరిస్తున్న కేంద్రం.. 18 తర్వాత అనుసరించే స్ట్రాటజీపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను 15వ తేదీలోపు పంపించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను పంపించాయి. ఇందులో చాలా రాష్ట్రాలు విస్తృతంగా ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేయడం, ప్రజా రవాణాను పునరుద్ధరించడం, లాక్‌డౌన్‌ను పరిమిత ప్రాంతాల్లోనే అమలు చేయాలని అభిప్రాయపడ్డాయి. కరోనా ప్రభావం లేని జిల్లాల్లో రాకపోకలకు అనుమతినివ్వడమే కాకుండా రాష్ట్రాల మధ్య కూడా పాస్‌లు జారీ చేసి ప్రయాణాలకు అవకాశమివ్వాలని మెజార్టీ రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. ఆన్‌లైన్ డెలివరీకి, పెళ్లిళ్లు, అంత్యక్రియలకు స్వల్ప సంఖ్యలో జనాలకు అనుమతిలివ్వాలని అభిప్రాయపడ్డట్టు కొందరు అధికారులు తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో.. భౌతిక దూరం పాటించడం, మాస్కులు వినియోగించడం, సదస్సులు, సభలు, పాఠశాలలపై నిషేధాల్లాంటి పలు జాగ్రత్తలు కొనసాగిస్తూనే.. దాదాపుగా లాక్‌డౌన్ ఎత్తేయాలని భావిస్తున్నాయి. కేవలం, బీహార్, జార్ఖండ్, ఒడిశాలు మాత్రమే కఠినమైన లాక్‌డౌన్‌ను కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిసింది. ఈ రాష్ట్రాలకు వలస కార్మికుల తాకిడి ఎక్కువగా ఉండటం గమనార్హం.
లాక్‌డౌన్ విధించి 50 రోజులకుపైగా గడిచినా.. కరోనా కేసులు తగ్గకపోగా.. ఆర్థిక వ్యవస్థ పతనం అంచులకు చేరుకున్నది. అందుకే, వైరస్‌తో సహజీవనం చేస్తూనే.. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించుకుని ఎకానమీని కాపాడుకోవాలని కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోన్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ మొదలు.. ప్రధాని మోడీ వరకూ కరోనాతో కలిసి ఉండేందుకు సిద్ధపడాల్సిందేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, గుజరాత్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు పెద్దమొత్తంలో ఆర్థిక కార్యకలాపాలను పున:ప్రారంభించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అలాగే, జిల్లా మొత్తానికీ రెడ్ జోన్ ప్రకటించరాదనీ, లాక్‌డౌన్‌ను… కంటైన్‌మెంట్ జోన్‌కే అంటే ఒక బిల్డింగ్ పరిధి నుంచి స్వల్ప వైశాల్యం గల ఏరియాలకే పరిమితం చేయాలని కోరాయి. కరోనా కట్టడి కోసం అధిక కేసులుండే కంటైన్‌మెంట్ జోన్‌లకే లాక్‌డౌన్‌ను పరిమితం చేసి విస్తారంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నట్టు తెలుస్తోన్నది.
ఇక టూరిజంపై ఆధారపడే కేరళ.. మెట్రో సర్వీసులు, లోకట్ ట్రైన్‌లు, దేశీయ విమానయానాలు, హోటళ్లు, రెస్టారెంట్‌లనూ తెరవాలని ఆశపడుతున్నది. కర్ణాటక కూడా రెస్టారెంట్‌లు, హోటళ్లు, జిమ్నాషియంలు ఇతర కొన్ని పబ్లిక్ స్పేస్‌లను ఓపెన్ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేవలం కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెంచుకోవాలని తమిళనాడు ప్రభుత్వం సూచనలు చేసింది. అహ్మదాబాద్, సూరత్, వడోదర మినహా అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఎత్తేయాలని గుజరాత్ భావిస్తోన్నది. కాగా, మహారాష్ట్ర కూడా ముంబై సహా పూణె, థానె లాంటి ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపింది. కాగా, వలస కార్మికులతో ముప్పు ఎదుర్కొంటున్న జార్ఖండ్, ఒడిశా, బీహార్‌లు లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని కోరుకుంటున్నట్టు తెలిసింది.