ఎల్ఐసీ ఐపీవో ప్రక్రియ ఆలస్యం

దిశ, వెబ్‌డెస్క్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీవో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సంస్థ మదింపు ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల వాయిదా పడనుందని తెలుస్తోంది. ప్రాథమిక దశలోనే ఉన్న కారణంగా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని, పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఏడాది వరకు ఎల్ఐసీ సంస్థ ఐపీవో ఉండకపోవచ్చని సమాచారం.

అసెట్ వాల్యుయర్‌ (Asset valuation)ను ప్రభుత్వం ఇంకా నియమించలేదు. ఐపీవోకు ఈ ప్రక్రియ ఎంతో కీలకం. కాబట్టి, ఇప్పటికిప్పుడు ఆస్తులను లెక్కగట్టేందుకు మధ్యవర్తిని నియమించినా పూర్తి చేసేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈ కారణంగానే ప్రస్తుత ఏడాదిలో ఐపీవోకు వచ్చే అవకాశంలేదని, 2021లోనే ఎల్ఐసీ ఐపీవోకు వస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐపీవోకు సంబంధించి దిపార్ట్ ఆఫ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ జూన్‌లోనే బిడ్లను ఆహ్వానించింది.

అయితే, దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఐపీవో ముందు కార్యాచరణ నిర్వహించేందుకు రెండు సలహా సంస్థలను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించింది. కాగా, ప్రభుత్వ సంస్థల్లో ఉన్న వాటాలను విక్రయించి రూ. 2.10 లక్షల కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు. అయితే, తర్వాతి పరిణామాల్లో ప్రభుత్వ అంచనాలు మారిపోయాయి. కొవిడ్ వల్ల ఇప్పటికే బీపీసీఎల్, ఎయిర్ ఇండియా వాటాల విక్రయాన్ని రెండు సార్లు వాయిదా వేశారు. ఇప్పుడు ఎంతో కీలకంగా భావిస్తున్న ఎల్ఐసీ ఐపీవో ప్రక్రియ కూడా వెనక్కి వెళ్తోంది.

Advertisement