వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్

by  |
వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్
X

దిశ, న్యూస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వీధి వ్యాపారాలకు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై స్టాంపు డ్యూటీ చెల్లింపును పూర్తిగా మినహాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని సుమారు లక్షకు పైగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, మూడున్నర లక్షలకు పైగా వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇకమీదట ఎంఎస్ఎంఈ పరిశ్రమల నిర్వాహకులు రూ. వెయ్యి , వీధి వ్యాపారులు రూ. 400 చొప్పున రుణాలపై స్టాంపు డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు.

వారి తరపున ప్రభుత్వమే చెల్లించనుంది. వీధి వ్యాపారులు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10వేల వరకు బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీతో రుణం తీసుకోడానికి వీలవుతుంది. దీంతో రాష్ట్రం మొత్తం మీద సుమారు రూ. 350 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్బర్ ప్యాకేజీ ద్వారా ఎంఎస్ఎంఈ నిర్వాహకులకు సుమారు రూ. 7,300 కోట్ల మేర లబ్ధి కలుగుతుంది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు తక్షణం అమలులోకి వచ్చి అక్టోబరు 31వ తేదీ వరకు వర్తిస్తాయి.

ఎంఎస్ఎంఈ, వీధి వ్యాపారులకు రుణాలు సమకూర్చడంపై జిల్లాల కలెక్టర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్లు, మున్సిపల్ కమిషనర్‌తో రాష్ట్ర సీఎస్ ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో ఈ అంశాన్ని చర్చించి క్షేత్రస్థాయిలోని ఇబ్బందులను తెలుసుకున్న తర్వాత స్టాంపు డ్యూటీ భారం గురించి ప్రభుత్వానికి స్పష్టత ఏర్పడింది. కరోనా కష్టకాలంలో లాక్‌డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిని, ఇప్పుడు అన్‌లాక్ సమయంలో కోలుకుంటున్న స్థితిలో స్టాంపు డ్యూటీని కట్టాల్సి రావడాన్ని వారు భారంగా భావిస్తున్నట్లు స్వయంగా సీఎస్ ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో ఈ మినహాయింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.


Next Story

Most Viewed