ఓటీటీల్లో ఎక్కడ చూసినా ఆమే!

by Shyam |
ఓటీటీల్లో ఎక్కడ చూసినా ఆమే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓటీటీ బూమ్ ప్రారంభమైన కొత్తలో బాలీవుడ్‌లో రాధికా ఆప్టేకు ఒక పేరు ఉండేది. ఏ ఓటీటీలో చూసినా తనే కనిపిస్తోందని అనేవారు. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ఇలాంటి క్రేజ్ తెచ్చుకుంటున్న నటి ఒకరున్నారు. కీర్తి సురేష్ అని మీరు అనుకోవచ్చు కానీ కాదు. మిస్ ఇండియా సినిమా చూస్తే కీర్తి సురేష్ పక్కనే ఇంకొక నటి కనిపిస్తుంది. ఆమె పేరు శ్రీపాద దివ్య దృష్టి. ఇలా చెప్తే చాలా తక్కువ మందికి తెలుస్తుంది. కానీ గర్ల్ ఫార్ములా దివ్య అంటే అందరికీ తెలుస్తుంది. అవును. ఇప్పుడు మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కథలో ప్రాధాన్యమున్న సహాయ పాత్రల్లో దివ్య కనిపిస్తోంది. కలర్ ఫొటోతో ప్రారంభమైన దివ్య ఓటీటీ హవా.. ఇటీవల మిడిల్ క్లాస్ మెలోడీస్‌తో దాదాపు మేజర్ ఓటీటీలను కవర్ చేసినట్లయింది. ఆహాలో విడుదలైన కలర్ ఫొటోలో, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మిస్ ఇండియాలో, అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన మిడిల్ క్లాస్ మెలోడీస్‌లో దివ్య మంచి పాత్రలు పోషించింది.

ఊరికే కనిపిస్తుంటేనే ఇంత బిల్డప్ ఇవ్వాలా అనుకోవద్దు. కలర్ ఫొటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల్లో ఆమె నటన చూస్తే ఫిదా అవక తప్పదు. పెద్ద పెద్ద కళ్లు, పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయిలను తెలుగు వాళ్లు ఎందుకు ఇష్టపడతారనేది దివ్యను చూస్తే అర్థమవుతుంది. చాలా నేచురల్‌గా సాగే నటనతో మంత్రముగ్ధులను చేస్తుంది. మంచికి మంచి, పంచ్‌కి పంచ్ అన్నట్లు చెప్పే ఆమె డైలాగ్ డెలివరీ ప్లస్ పాయింట్. అందుకేనేమో ఇప్పుడు కొన్ని మీమ్ పేజీలు ఆమెను అన్ని ఓటీటీలు కవర్ చేసిన టాలీవుడ్ రాధికా ఆప్టే అని పొగిడేస్తున్నాయి. అయితే ఈ మూడు సినిమాలతోనే దివ్య నటనను జడ్జ్ చేయవచ్చా? అనే అనుమానం ఉన్నవాళ్లందరూ ఒక్కసారి యూట్యూబ్‌లో గర్ల్ ఫార్ములా చానల్‌లో ఉన్న వీడియోలను చూడండి. అక్కడ దివ్య నట విశ్వరూపం ఏంటో తెలుస్తుంది. నిజానికి ఆమె ఓటీటీల్లో ఇలా రాణించడానికి బీజం వేసిన వీడియోలు అవే.. అందుకే ఆమెను గర్ల్ ఫార్ములా దివ్య అంటారు.

Advertisement

Next Story

Most Viewed