ఉత్తమ్‌వి అనాలోచిత వ్యాఖ్యలు : శ్రీనివాస్ రెడ్డి

by Shyam |   ( Updated:2020-04-16 09:14:28.0  )
ఉత్తమ్‌వి అనాలోచిత వ్యాఖ్యలు : శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, న్యూస్‌‌ బ్యూరో: పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంపై వాస్తవాలు తెలుసుకోకుండా అనాలోచితంగా టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడటం బాధాకరమని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం సివిల్ సప్లయి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,పేద ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న 12 కిలోల బియ్యం, రూ.1,500 నగదు అందలేదని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలోవాస్తవం లేదన్నారు. గురువారం మధ్యాహ్నం వరకూ 91 శాతం రేషన్ ప్రజలకు అందించినట్టు తెలిపారు. రెండు విడతల్లో ఇవ్వాల్సిన బియ్యం ఒకే దఫా‌లో పంపిణీ చేసినట్టు చెప్పారు. 87,54,049 మందికి రేషన్ బియ్యం ఇవ్వడం జరిగిందన్నారు. కిలోకు రూ.32 నుంచి రూ.38ధర ఉన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 1,000 కోట్లు రేషన్ కోసం ఖర్చు చేశామని తెలిపారు. 3 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేశామన్నారు. రూ.30 లక్షల వ్యయంతో వలస కార్మికులకు బియ్యం ఇప్పటి వరకు పంపిణీ చేసినట్లు వివరించారు. 74లక్షల మంది అకౌంట్లలో రూ.1,500 చొప్పున ఇప్పటి వరకు నగదు బదిలీ చేశామనీ, మిగతా వారి ఖాతాలు రన్నింగ్‌లో లేకపోవడం వల్ల కొంత సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయనీ, రెండ్రోజుల్లో వాటిని కూడా క్లియర్ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 13 లక్షల మందికి బియ్యం పంపిణీ చేశామన్నారు.

Tags: TPCC Cheif Uttam, comments, false, srinivasreddy, civil supply office, rice, money

Advertisement

Next Story

Most Viewed