పత్రిక కొంటే.. మాస్క్ ఫ్రీ

by  |
పత్రిక కొంటే.. మాస్క్ ఫ్రీ
X

దిశ, వెబ్‌డెస్క్ :
కొవిడ్ విజృంభిస్తున్న వేళ.. మాస్క్ ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. అయినా కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మాస్క్‌లు లేకుండానే రోడ్ల మీదకొస్తున్నారు. కరోనా తమను ఏమీచేయదన్న ధీమాతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇలా చేయడం వల్ల తమ ప్రాణాలను రిస్క్‌లో పడేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా డేంజర్‌ జోన్‌లోకి నెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్క్ ధరించడంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు మాస్క్ ప్రాముఖ్యతను తెలిపేందుకు ఓ దినపత్రిక వినూత్న ప్రయత్నం చేసింది.

జమ్ముకాశ్మీర్‌లో కరోనా విజృంభిస్తుండటంతో.. అక్కడ ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 254 మంది చనిపోయారు. ప్రస్తుతం 6,122 యాక్టివ్ కేసులున్నాయి. పైగా రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రతిరోజూ వార్తలను అందించడమే కాకుండా.. కొవిడ్‌పై అవగాహన కల్పించడాన్ని కూడా తమ బాధ్యతగా భావించిన శ్రీనగర్‌లోని ‘రోషిణి’ అనే ఉర్దూ దిన పత్రిక ఓ మంచి ప్రయత్నం చేస్తోంది. న్యూస్ పేపర్ కొన్నవాళ్లకి ఉచితంగా మాస్క్‌లు ఇస్తోంది. ‘దయచేసి మాస్క్ ధరించండి’ అని పాఠకులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక్కడ విశేషమేమిటంటే.. పత్రిక ధర కేవలం రూ. 2 మాత్రమే. రోషిణి పత్రిక యాజమాన్యం చేస్తున్న ఈ పనికి స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అందరూ వారిని ప్రశంసిస్తున్నారు. కాగా, జనాల్లో అవగాహన కలిగించడానికి ఇదొక మార్గంగా భావించామని పత్రిక ఎడిటర్ తెలిపారు. కరోనా వల్ల డైలీ న్యూస్ పేపర్ల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో పేపర్లు అత్యధిక నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ సామాజిక బాధ్యతతో ‘రోషిణి’ పేపర్ యాజమాన్యం చేస్తున్న పని నిజంగా అభినందనీయమని కశ్మీరీలు అంటున్నారు.



Next Story