‘నిమ్మగడ్డ విధుల్లో చేరితే అంతే’

by srinivas |
‘నిమ్మగడ్డ విధుల్లో చేరితే అంతే’
X

దిశ ఏపీ బ్యూరో: హైకోర్టు ఆదేశానుసారం నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్ఈసీగా నియమించాలంటూ ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రభుత్వానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, సుప్రీం తీర్పు గురించి వేచి చూస్తున్నామన్న విషయాన్ని గవర్నర్‌కు వివరిస్తామని చెప్పారు. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్సీపీకి కోర్టులన్నా, గవర్నర్ అన్నా లెక్కలేదని విమర్శలు చేయడంతో ఒక టీవీ డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ నిర్ణయాన్ని తాము తప్పుపట్టలేదని అన్నారు.

న్యాయ వ్యవస్థతో పాటు గవర్నర్ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్న ఆయన, సుప్రీంకోర్టులో ఈ కేసు ఉందని, తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని, ఈ విషయాన్ని గవర్నర్‌కి వివరిస్తామని మాత్రమే చెప్పామని గుర్తు చేశారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలతో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని తనలాంటి వారు భావిస్తున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేశానని అన్నారు. నిమ్మగడ్డ విధుల్లో చేరితే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టేనని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిమ్మగడ్డ గౌరవించాలని ఆయన సూచించారు. గవర్నర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణల్లో నిజం లేదని, గతంలో ఎస్ఈసీగా కనగరాజ్‌ను కూడా గవర్నరే నియమించారని ఆయన వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ విధుల్లో చేరితే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారని టీడీపీ ఆశపడుతోందని.. తమకు ప్రజాబలం ఉందని, వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనిని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed