నవంబర్‌లో అందుబాటులోకి స్పుత్నిక్‌-V!

న్యూఢిల్లీ: భారత్‌లో టీకా అందుబాటులోకి రావడానికి రష్యాతో కీలక ఒప్పందం కుదిరింది. రష్యా అభివృద్ధి చేస్తున్న టీకా స్పుత్నిక్-వీ (Sputnik-V) మూడో దశ ట్రయల్స్ భారత్‌లో నిర్వహించడానికి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (DRL) సిద్ధమైంది. అంతేకాదు, పది కోట్ల డోసులను డీఆర్ఎల్‌కు సరఫరా చేయడానికీ ఒప్పందం కుదిరినట్టు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) వెల్లడించింది.

భారత డ్రగ్ రెగ్యులేటరీ సంస్థలు ఆమోదం పొందిన తర్వాత స్పుత్నిక్-వీ (Sputnik-V) మూడో దశ ట్రయల్స్, అలాగే పది కోట్ల డోసుల సరఫరా ప్రక్రియ మొదలవుతుందని వివరించింది. మూడో దశ ట్రయల్స్ విజయవంతమైతే ఈ ఏడాది చివరిలోనే భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. త్వరలోనే ఫేజ్3 ట్రయల్స్‌ అనుమతుల కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ (CDSCO)ను ఆశ్రయించనున్నట్టు పేర్కొంది.

అలాగే, రెగ్యులేటరీ అనుమతుల అనంతరం భారత్‌లో వ్యాక్సినేషన్ కోసం డీఆర్ఎల్‌కు పదికోట్ల టీకా డోసులను సరఫరా చేస్తామని ఓ ప్రకటనలో వివరించింది. అయితే, ఈ టీకా ధరపై ఆర్‌డీఐఎఫ్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. వ్యాక్సిన్ వ్యాపార దృష్టితో అభివృద్ధి చేయలేదని, కేవలం తయారీ ఖర్చుతోనే అందిస్తామని ఇటీవలే రష్యా ప్రకటించడం గమనార్హం.

ప్రపంచంలో తొలిసారిగా రెగ్యులేటరీ ఆమోదం పొందిన టీకా స్పుత్నిక్-వీ. తొలి రెండు దశల ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది మూడో దశ ట్రయల్స్‌లో ఉన్నది. ఈ ట్రయల్స్‌తో పాటే ప్రజలకు అందుబాటులో ఉంచడానికి రష్యా అనుమతినిచ్చింది.

స్పుత్నిక్-వీ టీకా మొదటి, రెండో ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, భారత్‌లో మూడో దశ ట్రయల్స్‌ను నిర్వహించబోతున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. భారత రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా సేఫ్టీ, సమర్థతను నిరూపించడానికి స్పుత్నిక్-వీ (Sputnik-V) టీకా మూడో దశ ట్రయల్స్‌ చేపడుతున్నట్టు వివరించారు. కరోనాపై పోరులో భారత్‌కు ఈ టీకా సహకరిస్తుందని తెలిపారు. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ ఒకటని, శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకా భారత్‌కు ఉపకరిస్తుందని ఆర్‌డీఐఎఫ్ (RDIF) సీఈవో కిరిల్ దిమిత్రియేవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement