కీ ప్లేయర్స్ మిస్సింగ్‌.. రెండో టెస్టుకు ముందు టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బలు

by Harish |
కీ ప్లేయర్స్ మిస్సింగ్‌.. రెండో టెస్టుకు ముందు టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బలు
X

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో టీమ్ ఇండియా అనూహ్య ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండు రోజులు పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌‌పై పట్టు సాధించిన స్థితిలో ఉన్న భారత్ ఓడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే, మూడో రోజు బౌలర్లు, నాలుగో రోజు బ్యాటర్లు చేసిన తప్పిదాలతో ఓటమి తప్పలేదు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఇక, ఇప్పుడు భారత్ ముందు లక్ష్యం సిరీస్‌లో పుంజుకోవడమే. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి కమ్ బ్యాక్ ఇవ్వాలని రోహిత్ సేన పంతంతో ఉన్నది. అయితే, ఇంగ్లాండ్‌తో పోరు అంత సులభం కాదని టీమ్ ఇండియాకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మరోవైపు, కీ ప్లేయర్స్ దూరమవడం కూడా భారత్‌కు కష్టాలు తెచ్చిపెట్టాయి. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ ఇప్పటికే రెండు టెస్టులకు దూరమవ్వగా.. తాజాగా కేఎల్ రాహుల్, జడేజా సైతం అందుబాటులో ఉండటం లేదు. వీరి గైర్హాజరులో రెండో టెస్టులో భారత్ పుంజుకోవడం అంత ఈజీ కాదు.

విరాట్ కోహ్లీ

వ్యక్తిగత కారణాలతో విరాట్ తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. అతని గైర్హాజరుతో తొలి టెస్టులో టీమ్ ఇండియాకు తీరని నష్టం కలిగింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ దారుణంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. సందర్భోచిత ఇన్నింగ్స్‌తో అతను జట్టును ఎన్నోసార్లు నిలబెట్టాడు. రెండో టెస్టుకు కూడా అతను అందుబాటులో ఉండకపోవడం భారత్‌కు ఎదురుదెబ్బే. రాహుల్ కూడా దూరమవడంతో మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ కీలకం కానున్నాడు.

మహ్మద్ షమీ

మోకాలి గాయంతో స్టార్ పేసర్ మహ్మద్ షమీ తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అతను నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందలేదు. ఉప్పల్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో భారత జట్టు ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగింది. బుమ్రా సత్తాచాటినప్పటికీ.. సిరాజ్‌ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతనికి ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే, వైజాగ్ పిచ్ మాత్రం పేస్‌ను అనుకూలంగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో షమీ లోటు భారత్‌కు లోటే. అతను ఉండి ఉంటే.. బుమ్రా, సిరాజ్, షమీ త్రయం ఇంగ్లాండ్ బ్యాటర్లను కచ్చితంగా ఇబ్బంది పెట్టేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే..సొంతగడ్డపై షమీ ఆడిన 21 టెస్టుల్లో భారత్ ఓడలేదు.

కేఎల్ రాహుల్

విరాట్ కోహ్లీ దూరమైన నేపథ్యంలో మిడిలార్డర్‌లో ఆ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేస్తాడని అంతా భావించారు. తొలి టెస్టులో అంచనాలకు తగ్గట్టే రాహుల్ రాణించాడనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా క్రీజులో పాతుకపోయినట్టే కనిపించిన అతను 22 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, తొడ కండరాల గాయంతో అతను రెండో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో రెండో టెస్టులో టీమ్ ఇండియా మిడిలార్డర్ సమస్యను ఎదుర్కోక తప్పదు. కోహ్లీ దూరంగా ఉంటున్న ఈ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో ఉండకపోవడం భారత్‌కు లోటే. అతని స్థానాన్ని రజత్ పాటిదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో వీరిలో ఒకరు టెస్టు అరంగేట్రం చేయనున్నారు. కాబట్టి, బలమైన ఇంగ్లాండ్ బౌలింగ్ దళాన్ని ఏ మేరకు ఎదుర్కొంటారో కచ్చితంగా చెప్పలేం.

రవీంద్ర జడేజా

ఇక నాలుగోవ మేజర్ మిస్సింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. స్నాయువు గాయంతో అతను వైజాగ్ టెస్టుకు దూరమయ్యాడు. నాలుగో రోజు పరుగు తీసే క్రమంలో అతను గాయపడ్డాడు. తొలి టెస్టులో అతను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా, ఐదు వికెట్లు తీసుకున్నాడు. 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉన్న జడేజా.. రెండో టెస్టుకు దూరమవడం టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బే కానుంది. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed