10,000 పరుగుల క్లబ్‌లో స్టీవ్ స్మిత్.. 35వ సెంచరీ బాదిన ఆస్ట్రేలియన్

by Ajay kumar |
10,000 పరుగుల క్లబ్‌లో స్టీవ్ స్మిత్.. 35వ సెంచరీ బాదిన ఆస్ట్రేలియన్
X

- అత్యధిక సెంచరీల జాబితాలో 7వ ర్యాంకు

దిశ, స్పోర్ట్స్:

శ్రీలంక పర్యటనలో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెండు మైలు రాళ్లను ఒకే మ్యాచ్‌లో సాధించాడు. భారత్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో 10వేల పరుగులకు కేవలం ఒకే పరుగు దూరంలో ఆగిన స్మిత్.. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆ సింగిల్ పరుగు సాధించి 10వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. టెస్టుల్లో పదివేల పరుగుల సాధించిన 14వ ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తన నాలుగో నంబర్‌లో బరిలోకి దిగిన స్మిత్.. నిలకైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో స్మిత్ 35వ సెంచరీని నమోదు చేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 35 సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. స్టీవ్ స్మిత్ 35 సెంచరీలు చేరుకోవడానికి 205 ఇన్నింగ్స్‌లు పట్టగా.. రికీ పాంటింగ్ 195 ఇన్నింగ్స్, సచిన్ టెండుల్కర్ 200 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకున్నారు. కాగా టెస్టుల్లో 35 సెంచరీలు నమోదు చేసిన 7వ బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. సచిన్ (51 సెంచరీలు), జాక్వెస్ కల్లిస్ (45), పాంటింగ్ (41), కుమార సంగక్కర (38), రాహుల్ ద్రావిడ్ (36), జో రూట్ (36)లు స్మిత్ కంటే ముందున్నారు.

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో కమ్మన్స్ గాయపడటంతో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్‌గా ఇది స్మిత్‌కు 16వ సెంచరీ. దీంతో కెప్టెన్లుగా స్టీవ్ వా, అలన్ బోర్డర్‌ల 15 సెంచరీల రికార్డును దాటేశాడు. స్మిత్ కంటే ముందు కెప్టెన్‌గా పాంటింగ్ మాత్రమే అత్యధిక సెంచరీలు (19) నమోదు చేశాడు. ఇక మొత్తంగా చూస్తే సౌతాఫ్రికా తరపున గ్రేమ్ స్మిత్ (25), ఇండియా తరపున విరాట్ కోహ్లీ (20) స్మిత్ కంటే ముందున్నారు.



Next Story

Most Viewed