Steve Smith: తడబడుతున్న ఆసీస్ స్టార్ బ్యాటర్.. కథ ముగిసినట్టేనా?

by Vinod kumar |   ( Updated:2023-10-20 13:55:35.0  )
Steve Smith: తడబడుతున్న ఆసీస్ స్టార్ బ్యాటర్.. కథ ముగిసినట్టేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌ కప్‌లో స్థాయికి తగ్గట్టుగా ఆడటంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్‌ స్మిత్‌ విఫలమవుతున్నాడు. టెస్టులలో నిలకడగా ఆడుతున్న స్టీవ్ స్మిత్ వన్డేలలో మాత్రం ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో స్మిత్‌.. నాలుగు మ్యాచ్‌లు ఆడి విఫలమయ్యాడు. గత నాలుగు మ్యాచ్‌లలో స్మిత్‌ స్కోర్లు.. 46, 19, 0, 7 పరుగులు మాత్రమే. ఇవాళ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మిత్‌ 7 పరుగులే చేసి ఔట్‌ అవడంతో స్టార్‌ బ్యాటర్‌ కథ ముగిసినట్టేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

చెన్నైలో భారత్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులు చేసిన స్మిత్‌.. తర్వాత సఫారీలతో మ్యాచ్‌లో 19 పరుగులే చేయగలిగాడు. శ్రీలంక మ్యాచ్‌లో డకౌట్‌ అయిన స్మిత్‌.. తాజాగా పాకిస్తాన్‌తో ఏడు పరుగులకే నిష్క్రమించాడు. గత పది వన్డేలలో స్మిత్‌ చేసింది ఒక్కటంటే ఒక్కటే అర్థ సెంచరీ. వన్డేలలో స్మిత్‌ సెంచరీ చేసి ఏడాది దాటింది. ఈ ఏడాది వన్డేలలో 9 ఇన్నింగ్స్ ఆడిన స్మిత్‌.. 23.22 సగటుతో 209 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక అర్థ సెంచరీ మాత్రమే ఉండగా మూడుసార్లు డకౌట్‌ అయ్యాడు. యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో స్మిత్‌ ఇదే ఆట కొనసాగిస్తే మరో రెండేళ్లు అయినా ఆడాల్సిన అతడి వన్డే కెరీర్‌ వరల్డ్‌ కప్‌ తర్వాత ముగిసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story