రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన శ్రీలంక.. అయినప్పటికీ 455 పరుగుల ఆధిక్యంతో పట్టు

by Harish |
రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన శ్రీలంక.. అయినప్పటికీ 455 పరుగుల ఆధిక్యంతో పట్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆధిపత్యం కొనసాగుతోంది. సోమవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 455 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. అయితే, సోమవారం ఆఖర్లో బంగ్లా బౌలర్లు మెరవడంతో తడబడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 102/6 స్కోరుతో నిలిచింది. అంతకుముందు మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 55/1తో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్.. శ్రీలంక బౌలర్ల ధాటికి తేలిపోయింది. జకీర్ హసన్(54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా వారు విఫలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 178 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/34) సత్తాచాటాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకకు 353 పరుగుల ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 531 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

అయితే, మూడో రోజు చివర్లో బౌలర్లు పుంజుకుని బంగ్లాకు కాస్త ఊరటనిచ్చారు. హసన్ మహముద్(4/51) బంతితో మెరవడంతో రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన శ్రీలంక సోమవారం ఆట ముగిసే సమయానికి 102/6 స్కోరుతో నిలిచింది. కరుణరత్నే(4), కుసాల్ మెండిస్(2), చండిమాల్(9), ధనంజయ డి సిల్వ(1), కమిందు మెండిస్(9)‌ దారుణంగా నిరాశపరిచారు. ఏంజెలో మాథ్యూస్(39 బ్యాటింగ్), ప్రభాత్ జయసూర్య(3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మంగళవారం తొలి సెషన్‌లోనే బంగ్లా ఛేదనకు దిగొచ్చు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్న తరుణంలో బంగ్లా బ్యాటర్లు పోరాడకపోతే అదే రోజు శ్రీలంక విజయం ఖాయమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed