SL VS NZ : కివీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. 15 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కైవసం

by Harish |
SL VS NZ : కివీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. 15 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో శ్రీలంక సంచలన ప్రదర్శన చేసింది. రెండో టెస్టులోనూ నెగ్గి టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గల్లె వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. దీంతో 15 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌పై శ్రీలంక ఓ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇంతకుముందు 2009లో చివరిసారిగా టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. అప్పుడు కూడా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం గమనార్హం.

రెండో టెస్టులో శ్రీలంక మొదటి రోజు నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో కామిందు మెండిస్(182 నాటౌట్), కుసాల్ మెండిస్(106 నాటౌట్), చండిమాల్(116), ఏంజెలో మాథ్యూస్(88) రాణించడంతో శ్రీలంక 602/5 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ ఇచ్చింది. అనంతరం బంతితోనూ మెరిసిన శ్రీలంక.. కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులకే కూల్చి 514 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలోనే ప్రత్యర్థిని మూడో రోజే ఫాలో ఆన్ ఆడించింది. ఓవర్‌నైట్ స్కోరు 199/5‌తో నాలుగో రోజు ఆట కొనసాగించిన కివీస్‌ను లంక బౌలర్లు 360 పరుగులకు ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ విజయాన్ని కట్టబెట్టారు.

ఆదివారం న్యూజిలాండ్ 165 పరుగులు జోడించి ఆఖరి ఐదు వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్(78), మిచెల్ సాంట్నర్(67), టామ్ బ్లండెల్(60), కాన్వే(61) రాణించారు. మూడో రోజే కీలక వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు పోరాటం ఫలించలేదు. శ్రీలంక బౌలర్లలో నిషాన్(6/170) ఆరు వికెట్లతో విజృంభించగా.. ప్రభాత్ జయసూర్య(3/139) సత్తాచాటాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి నిషాన్, జయసూర్య చెరో 9 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించారు. భారీ శతకం సాధించిన కామిందు మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. రెండు టెస్టుల్లో 18 వికెట్లు పడగొట్టిన జయసూర్య ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

Advertisement

Next Story