రోహిత్ రాత్రి కాల్ చేసి విరాట్ గురించి చెప్పాడు.. వెంటనే నిద్రపోయా.. ఫన్నీ స్టోరీ చెప్పిన శ్రేయస్ అయ్యర్

by Harish |
రోహిత్ రాత్రి కాల్ చేసి విరాట్ గురించి చెప్పాడు.. వెంటనే నిద్రపోయా.. ఫన్నీ స్టోరీ చెప్పిన శ్రేయస్ అయ్యర్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సత్తాచాటాడు. 36 బంతుల్లో 59 పరుగులతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే, తుది జట్టులో అతనికి అనూహ్యంగా చోటు దక్కిందట. ఈ విషయాన్ని అయ్యరే స్వయంగా వెల్లడించాడు. మ్యాచ్ ముందు రోజు జరిగిన ఫన్నీ స్టోరీని వివరించాడు. ‘మ్యాచ్ ముందు రోజు రాత్రి ఓ మూవీ చూస్తూ ఉన్నా. రాత్రంతా అలా చూస్తునే ఉండాలనుకున్నా. కానీ, కెప్టెన్ రోహిత్ నుంచి నాకు కాల్ వచ్చింది. విరాట్ మోకాలిలో వాపు వచ్చిందని, నువ్వు ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. వెంటనే నా రూంకు వెళ్లి నిద్ర పోయాను. మొదటి మ్యాచ్ నేను ఆడతానని అనుకోలేదు. కానీ, దురదృష్టవశాత్తూ కోహ్లీ గాయపడ్డాడు. దీంతో నాకు అవకాశం వచ్చింది. నేను కూడా సిద్ధంగానే ఉన్నా. ఎప్పుడైనా ఆడటానికి చాన్స్ ఉంటుందని నాకు తెలుసు.’ అని చెప్పుకొచ్చాడు. అలాగే, గత ఆసియా కప్‌లో కూడా ఇలాంటిదే జరిగిందని గుర్తు చేసుకున్నాడు. తాను గాయపడి మ్యాచ్‌కు దూరమైతే తన స్థానంలో వచ్చిన మరో ప్లేయర్ సెంచరీ చేశాడని చెప్పాడు. కోహ్లీ గాయపడటంతో అనూహ్యంగా దక్కిన అవకాశాన్ని అయ్యర్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆరు నెలల తర్వాత జాతీయ జట్టుకు ఆడిన అతను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.


Next Story

Most Viewed