జైశ్వాల్, దూబె ధనాధన్.. టీ20 సిరీస్ భారత్ కైవసం

by Harish |   ( Updated:2024-01-14 18:25:24.0  )
జైశ్వాల్, దూబె ధనాధన్.. టీ20 సిరీస్ భారత్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ టీమ్ ఇండియా సొంతమైంది. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ చేతికి చిక్కింది. యశస్వి జైశ్వాల్, శివమ్ దూబె ధనాధన్ ఇన్నింగ్స్‌తో రెండో టీ20లో టీమ్ ఇండియా అలవోకగా నెగ్గింది. ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 6 వికెట్లతో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. గుల్బాదీన్ నయీబ్(57) హాఫ్ సెంచరీతో మెరవగా.. ముజీబ్(21), కరీమ్ జనాత్(20) విలువైన పరుగులు జోడించారు. అర్ష్‌దీప్ సింగ్(3/32), అక్షర్ పటేల్(2/17), రవి బిష్ణోయ్(2/39) సత్తాచాటారు. అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(68), శివమ్ దూబె(63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రెచ్చిపోవడంతో భారత్ 15.4 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. 4 ఓవర్లలో 2 వికెట్లు తీయడంతోపాటు 17 పరుగులే ఇచ్చిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ మూడు టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లడంతోపాటు సిరీస్‌ను దక్కించుకుంది. ఇక, నామమాత్రపు మూడో టీ20 ఈ నెల 17న బెంగళూరు వేదికగా జరగనుంది.

కుర్రాళ్లే కొట్టేశారు

లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(0) తొలి ఓవర్‌లోనే డకౌటయ్యాడు. గత మ్యాచ్‌లోనూ రోహిత్ పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కలిసి ఇన్నింగ్స్‌ను వేగంగా నిర్మించారు. దాదాపు 14 నెలల తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ క్రీజులో ఉన్నది కాసేపే అయినా ఉన్నంత సేపు బౌండరీలతో ప్రేక్షకులను అలరించాడు. మరోవైపు, జైశ్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 5వ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. అయితే, ఈ జోడీకి నవీన్ ఉల్ హక్ బ్రేక్ వేశాడు. దూకుడుగా ఆడుతున్న కోహ్లీ(29) అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శివమ్ దూబె మరోసారి తన బ్యాటును ఝళిపించాడు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన అతను వరుసగా రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అప్పటికే క్రీజులో పాతుకపోయిన జైశ్వాల్‌తో పోటాపోటీగా మెరుపులు మెరిపించాడు. ముందుగా జైశ్వాల్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. కాసేపటికే దూబె సైతం 22 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. వీరి జోరు చూస్తుంటే వీరిద్దరే జట్టును గెలిపించేలా కనిపించారు. మూడో వికెట్‌కు ఈ జోడీ 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కరీమ్ జనాత్ బౌలింగ్‌లో జైశ్వాల్‌(68) అవుటవడంతో ఈ జోడీకి విడిపోగా.. అదే ఓవర్‌లో జితేశ్ శర్మ(0) వికెట్ పారేసుకున్నాడు. అయితే, అప్పిటికే భారత్ విజయం ఖరారవ్వగా.. రింకు సింగ్(9)తో కలిసి దూబె మిగతా పని పూర్తి చేశాడు. దీంతో 15.4 ఓవర్లలోనే భారత్ 4 వికెట్లను కోల్పోయి 173 పరుగులు చేసి గెలుపొందింది. అఫ్గాన్ బౌలర్లలో కరీమ్ జనాత్ 2 వికెట్లు తీయగా.. ఫారూఖీ, నవీన్ ఉల్ హక్‌కు చెరో వికెట్ దక్కింది.

రాణించిన గుల్బాదిన్

అంతుకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ గుర్బాజ్(14) ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించినా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అతను శివమ్ దూబెకు క్యాచ్ ఇచ్చాడు. క్రీజులోకి వచ్చిన గుల్బాదిన్(57) జట్టుకు అండగా నిలిచాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ జద్రాన్(8), అజ్మతుల్లా(2) నిరాశపరిచారు. అయితే, గుల్బాదిన్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్, శివమ్ దూబె బౌలింగ్‌లో మెరుపులు మెరిపించిన అతను.. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతని దూకుడుకు అక్షర్ పటేల్ బ్రేక్ వేశాడు. 12వ ఓవర్‌లో మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి రోహిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసపటికే మహ్మద్ నబీ(14) మైదానం వీడాడు. నజీబుల్లా జద్రాన్(23), ముజీబ్(21), కరీమ్ జనాత్(20) విలువైన పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా వేసిన అర్ష్‌దీప్ సింగ్.. కరీమ్ జనాత్‌తోపాటు నూర్ అహ్మద్‌ను పెవిలియన్ పంపాడు. ఆఖరి బంతికి ముజీబ్, ఫారూఖీ రనౌటయ్యారు. అర్ష్‌దీప్ ఆరో బంతిని వైడ్ వేయగా.. నాన్ స్ట్రైకర్‌లో ఉన్న ముజీబ్ అనవసర పరుగుకు యత్నించి వికెట్ కోల్పోయాడు. ఇక, చివరి బంతిని ఆడిన నవీన్ ఉల్ హక్(1 నాటౌట్) రెండో పరుగు కోసం ప్రయత్నించగా నాన్ స్ట్రైకర్ ఫారూఖీ(0) రనౌటవడంతో అఫ్గాన్ ఆటౌటైంది. ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ 172 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబెకు ఒక్క వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ : 172 ఆలౌట్(20 ఓవర్లు)

గుర్బాజ్(సి)శివమ్ దూబె(బి)రవి బిష్ణోయ్ 14, జద్రాన్(బి)అక్షర్ 8, గుల్బాదిన్ నయీబ్(సి)రోహిత్(బి)అక్షర్ 57, అజ్మతుల్లా ఒమర్జాయ్(బి)శివమ్ దూబె 2, మహ్మద్ నబీ(సి)రింకు సింగ్(బి)రవి బిష్ణోయ్ 14, నజీబుల్లా జద్రాన్(బి)అర్ష్‌దీప్ సింగ్ 23, కరీమ్ జనాత్(సి)అక్షర్(బి)అర్ష్‌దీప్ సింగ్ 20, ముజీబ్ రనౌట్(జితేశ్ శర్మ/అర్ష్‌దీప్ సింగ్) 21, నూర్ అహ్మద్(సి)కోహ్లీ(బి)అర్ష్‌దీప్ సింగ్ 1, నవీన్ ఉల్ హక్ 1 నాటౌట్, ఫారూఖీ రనౌట్(యశస్వి జైశ్వాల్) 0; ఎక్స్‌ట్రాలు 11.

వికెట్ల పతనం : 20-1, 53-2, 60-3, 91-4, 104-5, 134-6, 164-7, 170-8, 171-9 , 172-10

బౌలింగ్ : అర్ష్‌దీప్ సింగ్(4-0-32-3), ముకేశ్ కుమార్(2-0-21-0), రవి బిష్ణోయ్(4-0-39-2), అక్షర్ పటేల్(4-0-17-2), శివమ్ దూబె(3-0-36-1), సుందర్(3-0-23-0)

భారత్ ఇన్నింగ్స్ : 173/4(15.4 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్(సి)గుర్బాజ్(బి)కరీమ్ జనాత్ 68, రోహిత్(బి)ఫారూఖీ 0, కోహ్లీ(సి)ఇబ్రహీం జద్రాన్(బి)నవీన్ ఉల్ హక్ 29, శివమ్ దూబె 63 నాటౌట్, జితేశ్ శర్మ(సి)నబీ(బి)కరీమ్ జనాత్ 0, రింకు సింగ్ 9 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4.

వికెట్ల పతనం 5-1, 62-2, 154-3, 156-4

బౌలింగ్ : ఫారూఖీ(3.4-0-28-1), ముజీబ్(2-0-32-0), నవీన్ ఉల్ హక్(3-0-33-1), నూర్ అహ్మద్(3-0-35-0), మహ్మద్ నబీ(2-0-30-0), కరీమ్ జనాత్(2-0-13-2)

Advertisement

Next Story

Most Viewed