మలేషియా ఓపెన్‌ ఫైనల్‌లో సాత్విక్ జోడీ ఓటమి

by Harish |
మలేషియా ఓపెన్‌ ఫైనల్‌లో సాత్విక్ జోడీ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఈ సీజన్‌‌ను ఘనంగా మొదలుపెట్టాలనుకున్న సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ జోడీ రన్నరప్‌గా సరిపెట్టింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మొదటి నుంచి సత్తాచాటిన సాత్విక్, చిరాగ్ జంట ఫైనల్‌లో బోల్తా పడింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‌లో సాత్విక్ జోడీ 21-9, 18-21, 17-21 తేడాతో టాప్ సీడ్, చైనాకు చెందిన లియాంగ్ వెయ్ కెంగ్- వాంగ్ చెంగ్ చేతిలో పోరాడి ఓడింది. 58 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం సాత్విక్ జోడీదే. తొలి గేమ్‌కు ఏకపక్షంగా గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, రెండో గేమ్‌లో చైనా షట్లర్లు బలంగా పుంజుకున్నారు. సాత్విక్, చిరాగ్ ఆరంభంలో పలు తప్పిదాలతో 2-8తో వెనుకబడ్డారు. ఆ తర్వాత పుంజుకున్నప్పటికీ ప్రత్యర్థి జోడీనే రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌ను నిర్ణయాత్మక గేమ్‌కు మళ్లించింది. ఇక, మూడో సెట్‌‌ను సాత్విక్ జోడీ చేజాతులా కోల్పోయింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన భారత జంట 10-3తో ఆధిక్యంలో నిలిచి మూడో గేమ్‌ను సునాయాసంగా గెలుచుకునేలా కనిపించింది. ఆ తర్వాత అనవసర తప్పిదాలతో ప్రత్యర్థులకు అవకాశాలను ఇచ్చి మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో చైనా జోడీ విజేతగా నిలువగా.. సాత్విక్, చిరాగ్ జంట రన్నరప్‌తో సరిపెట్టింది. మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను డెన్మార్ ప్లేయర్ అండర్స్ ఆంటోన్సెన్ గెలుచుకోగా.. ఉమెన్స్ సింగిల్స్ విజేతగా సౌత్ కొరియా క్రీడాకారిణి యాన్ సె యంగ్ నిలిచింది.

Advertisement

Next Story