రోహిత్ సూపరో.. సూపర్.. రెండు సార్లు మ్యాచ్ డ్రా.. ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ

by Swamyn |
రోహిత్ సూపరో.. సూపర్.. రెండు సార్లు మ్యాచ్ డ్రా.. ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ
X

ఇది కదా..! క్రికెట్‌లోని అసలైన మజా.. బంతి బంతికో మలుపు.. పరుగు పరుగుకు నరాలు తెగే ఉత్కంఠ.. ఒక సూపర్ హిట్ సస్పెన్ థ్రిల్లర్ మూవీలో ఎన్ని మలుపులు ఉంటాయో నిన్నటి మ్యాచ్‌లో అంతకుమించిన మలుపులు.ఆ సినిమా చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు థ్రిల్లింగ్‌కు గురవుతామో.. నిన్నటి మ్యాచ్‌లో అంతకుమించి నరాలు తెగే ఉత్కంఠ. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉన్న వేలాది మంది.. ‘జియో సినిమా’ వేదికగా లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న 16.5కోట్ల మంది.. ఊపిరి బిగబట్టి చూసిన క్షణాలవి. బంతి బంతికి మ్యాచ్ రసవత్తరంగా మారుతుంటే.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ చివరికి టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ పైసా వసూల్ మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దిశ, స్పోర్ట్స్

అఫ్గాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. కీలకమైన బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ కెప్టెన్ రోహిత్ శర్మ (121) అద్భుతమైన శతకంతో జట్టును ఆదుకున్నాడు. మరోవైపు, రింకూ సింగ్(69) సైతం అర్ధశతకంతో అదరగొట్టాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకోగా, అజ్మతుల్లా ఒక వికెట్ పడగొట్టాడు. 213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టు సైతం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రెహ్మతుల్లా గుర్బాజ్(50), ఇబ్రహీం(50), గుల్బాదిన్ నయీబ్(55) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల స్కోరూ సమం కావడంతో మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. తొలి సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 16 పరుగులు చేయగా, భారత్ సైతం 16 పరుగులే చేసింది. ఫలితంగా సూపర్ ఓవర్లోనూ మ్యాచ్ డ్రా అయింది. దీంతో రెండో సూపర్‌కు వెళ్లారు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా.. 11 పరుగులు చేసింది. అఫ్గాన్ 12 పరుగులు చేయాల్సి ఉండగా, ఒక పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో రెండో సూపర్ ఓవర్లో భారత్ విజేతగా నిలిచింది.





రింకూ సమేత రోహిత్ విజృంభణ

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ ఇండియాకు ఏమాత్రం శుభారంభం దక్కలేదు. అఫ్గాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ చెలరేగడంతో ఐదో ఓవర్ పూర్తికాకుండానే కీలక బ్యాటర్లు యశస్వీ జైశ్వాల్(4), కోహ్లీ(0), శివమ్ దూబే(1), సంజూ శాంసన్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 22 పరుగులకే భారత్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మ్యాచ్ మొత్తం అఫ్గాన్ ఆధీనంలోకి వెళ్లింది. కానీ, క్రీజులో రోహిత్ ఉన్నాడు. అతనికి తోడుగా రింకూ సింగ్ వచ్చాడు. ఇంకేముంది ఇద్దరూ చితక్కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. గత రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా నిరాశపర్చిన రోహిత్.. ఈ మ్యాచ్‌లో మాత్రం విజృంభించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ 64 బంతుల్లో (10 x 4, 6 x 6) 100 పరుగులు చేసి, అంతర్జాతీయ టీ20ల్లో ఐదో సెంచరీ సాధించాడు. మరోవైపు, రింకూ సింగ్ సైతం 36 బంతుల్లో (2 x 4, 3 x 6) అర్ధశతకం సాధించాడు. చివరివరకూ నాటౌట్‌గా నిలిచిన వీరు.. ఆఖరి ఓవర్లో మరింత రెచ్చిపోయి ఏకంగా 36 పరుగులు (4, N6, 6, 1, 6, 6, 6) పిండుకున్నారు. దీంతో ఐదు ఓవర్లలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పరిస్థితి నుంచి 20 ఓవర్లు ముగిసేసరికి అవే 4 వికెట్లు నష్టపోయి ఏకంగా 212 పరుగులు చేయడం గమనార్హం. రోహిత్ శర్మ 121 నాటౌట్‌గా నిలవగా, రింకూ సింగ్ 69 నాటౌట్‌తో నిలిచాడు.

అదరగొట్టిన ఆ ముగ్గురు

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. టాప్-3 బ్యాటర్లు గుర్బాజ్(50), ఇబ్రహీం(50), అజ్మతుల్లా(55) అర్ధసెంచరీలతో చెలరేగారు. 93 పరుగుల వద్ద గుర్బాజ్ అవుటవడంతో అఫ్గాన్‌ తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ వరుసగా ఇబ్రహీం, అజ్మతుల్లా(0)ను పెవిలియన్‌కు పంపండంతో 107కు మూడు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత 163, 167 పరుగుల వద్ద నాలుగు, ఐదో వికెట్లు పడటంతో ఇక మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చినట్టు కనిపించింది. కానీ..

చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సి ఉండగా..

20వ ఓవర్లో అఫ్గాన్‌ విజయానికి 19 పరుగులు కావాల్సి ఉండగా, విజయం భారత్‌దేనని అంతా అనుకున్నారు. కానీ, అక్కడే అఫ్గాన్ బ్యాటర్లు మ్యాజిక్ చేశారు. ముకేశ్‌ వేసిన చివరి ఓవర్‌లో రెండు వైడ్లు వచ్చాయి. గుల్బాద్దిన్ నయీబ్ ఓ ఫోర్, సిక్స్‌ బాదాడు. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. గుల్బాద్దిన్ రెండు పరుగులు తీశాడు. దీంతో ఆ ఓవర్లో 18 పరుగులు(Wd, 4, 0, Wd, 2, 6, 2, 2) వచ్చాయి. మ్యాచ్‌ టై అయింది. సూపర్ ఓవర్‌కు వెళ్లింది.


తొలి సూపర్ ఓవర్ సాగిందిలా..

* మొదట బ్యాటింగ్ అఫ్గాన్.. బౌలర్ ఆవేశ్ ఖాన్

తొలి బంతి: గుల్బాద్దిన్ నయీబ్ (1) రనౌట్

రెండో బంతి: నబీ.. 1 పరుగు

మూడో బంతి: గుర్బాజ్‌.. ఫోర్

నాలుగో బంతి: సింగిల్

ఐదో బంతి: నబీ సిక్స్‌

ఆరో బంతి: బైస్‌ రూపంలో 3 పరుగులు

అఫ్గాన్ స్కోరు: 16/1 (W, 1, 4, 1, 6, 3LB)


* భారత్ టార్గెట్ 17.. బౌలర్ అజ్మతుల్లా

తొలి బంతి: రోహిత్.. లెగ్ బై రూపంలో సింగిల్

రెండో బంతి: జైశ్వాల్ సింగిల్

మూడో బంతి: రోహిత్‌ సిక్స్‌

నాలుగో బంతి: రోహిత్‌ సిక్స్‌

ఐదో బంతి: రోహిత్ సింగిల్ (రిటైర్డ్ ఔట్)

ఆరో బంతి: జైశ్వాల్ సింగిల్

* భారత్ స్కోరు 16 (1LB, 1, 6, 6, 1, 1)

* మ్యాచ్ మళ్లీ టై అయింది.


రెండో సూపర్ ఓవర్

తొలి బ్యాటింగ్ భారత్.. బౌలర్ ఫరీద్ అహ్మద్

తొలి బంతి: రోహిత్.. సిక్స్‌

రెండో బంతి: రోహిత్.. ఫోర్

మూడో బంతి: రోహిత్.. సింగిల్

నాలుగో బంతి: రింకు సింగ్.. కీపర్ క్యాచ్ ఔట్

ఐదో బంతి: శాంసన్ (రోహిత్ రనౌట్)

భారత్ స్కోరు 11/2(6, 4, 1, W, W)


అఫ్గాన్ టార్గెట్ 11.. బౌలర్ రవి బిష్ణోయ్

తొలి బంతి: మహ్మద్ నబీ ఔట్.. (రింకు సింగ్‌కు క్యాచ్‌)

రెండో బంతి: కరీం జనత్ సింగిల్

మూడో బంతి: రహ్మనుల్లా ఔట్.. (రింకు సింగ్‌కు క్యాచ్‌)

* రెండు వికెట్లు పడటంతో భారత్ విజయం


హైలెట్స్

రోహిత్ @ 1

ఈ సెంచరీతో అంతర్జాతీయ టీ20ల్లో 5 శతకాలు బాదిన తొలి బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ తర్వాత భారత ప్లేయర్ సూర్యకుమార్(4), ఆసిస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్(4), చెక్ రిపబ్లిక్ బ్యాటర్ సబవూన్(3), న్యూజిలాండ్ ప్లేయర్ కొలిన్ మున్రో(3) ఉన్నారు.


అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యాలు

190* రోహిత్ శర్మ- రింకూ సింగ్(అఫ్గాన్‌పై, బెంగళూరు)

176 సంజూ శాంసన్- దీపక్ హుడా(ఐర్లాండ్‌పై, డబ్లిన్)-2022

165 రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ (శ్రీలంకపై, ఇండోర్)- 2017

165 జైశ్వాల్- గిల్ (వెస్టిండీస్, లాడర్‌హిల్)- 2023


సంక్షిప్త స్కోరు బోర్డు

భారత్: 212/4(20ఓవర్లు)

* రోహిత్ శర్మ 121 నాటౌట్, రింకూ సింగ్ 69 నాటౌట్

* ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు

అఫ్గాన్: 212/6(20ఓవర్లు)

* గుర్బాజ్ 50, ఇబ్రహీం 50, గుల్బాద్దిన్ 55 నాటౌట్, మహ్మద్ నబీ 34

* వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్



Advertisement

Next Story

Most Viewed