లక్నోలోకి రోహిత్! : ఆ జట్టు కోచ్ ఏం చెప్పాడంటే..?

by Swamyn |
లక్నోలోకి రోహిత్! : ఆ జట్టు కోచ్ ఏం చెప్పాడంటే..?
X

దిశ, స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ మార్పు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని, గుజరాత్ జట్టు నుంచి తీసుకొచ్చి మరీ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై ముంబై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ సైతం ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది రోహిత్ శర్మ ముంబైని విడిచిపెట్టి, వేలంలోకి వస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రోహిత్‌ను దక్కించుకునేందుకు మిగతా జట్లన్నీ హోరాహోరీగా పోటీపడతాయనడంలో సందేహమే లేదు. అంతేకాకుండా, రోహిత్‌ను దక్కించుకుని కెప్టెన్‌ను చేయాలని చాలా ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. లక్నో జట్టు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లక్నో కోచ్ జస్టిన్‌ లాంగర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘వేలంలో మీరు ఏ ఆటగాడిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని ఇంటర్వ్యూయర్‌ అడగ్గా.. ‘‘ఎవరి పేరు చెబుతానని మీరు అనుకుంటున్నారు?’’ అని లాంగర్‌ తిరిగి ప్రశ్నించాడు. ‘‘మేం చాలామంది పేర్లు అనుకుంటున్నాం. కానీ, రోహిత్‌ శర్మను తీసుకోగలరా?’’ అని ఇంటర్వ్యూయర్‌ అడిగాడు. దీంతో లాంగర్‌ నవ్వుతూ, ‘‘రోహిత్‌ శర్మనా? ఓకే. మేం అతడిని ముంబై నుంచి తీసుకుంటాం. కానీ, ఈ డీల్ మీరే కుదర్చగలరు’’ అని సరదాగా సమాధానమిచ్చాడు. ఇదే అంశంపై వేరొక సందర్భంలో ముంబై జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు సైతం స్పందిస్తూ, ‘‘ముంబై జట్టును వీడాలా? వద్దా? అనేది రోహిత్ ఇష్టం. అతనికి నచ్చిన జట్టులోకి వెళ్లొచ్చు. అతని రాకకోసం, అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం కోసం పలు జట్లు ఆసక్తిగా ఉన్నాయి. అంతిమంగా అతనికి గౌరవం లభించే ఫ్రాంచైజీలోకి వెళ్తాడని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.



Advertisement

Next Story

Most Viewed