కోహ్లీ విషయంలో జై షాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ.. మాజీ క్రికెటర్ కామెంట్స్ వైరల్

by Harish |
కోహ్లీ విషయంలో జై షాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ.. మాజీ క్రికెటర్ కామెంట్స్ వైరల్
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పక్కనపెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలను భారత మాజీ ఆల్‌రౌండర్, 1983 వరల్డ్ కప్ విన్నర్ కీర్తి ఆజాద్ తోసిపుచ్చాడు. ఎక్స్ వేదికగా ఆదివారం కీర్తి ఆజాద్ స్పందిస్తూ.. విరాట్ టీ20 వరల్డ్ కప్ ఆడతాడని చెప్పాడు. జట్టు ఎంపికకు ముందే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపాడు.

అలాగే, బీసీసీఐ సెక్రెటరీ జై షాపై కీర్తి ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘టీ20 జట్టుకు కోహ్లీని పక్కనపెట్టేలా మిగతా సెలెక్టర్లను ఒప్పించాలని అజిత్ అగార్కర్‌‌ను జై షా కోరాడని అంటున్నారు. జై షా ఎందుకు అలా చేయాలి. అతను సెలెక్టర్ కాదు. జట్టును ఎంపిక చేసేందుకు మార్చి 15 వరకు అజిత్ అగార్కర్‌‌కు గడువు ఉంది. అయితే, మిగతా సెలెక్టర్లను అజిత్ ఒప్పించలేకపోయాడని అర్థమవుతుంది. రోహిత్‌ను కూడా జై షా సంప్రదించాడు. కానీ, కోహ్లీ మనకు కచ్చితంగా అవసరమని రోహిత్ తేల్చిచెప్పాడు. తెలివితక్కువ వ్యక్తులు ఎంపిక ప్రక్రియలో పాల్గొనకూడదు.’ అని ట్వీట్ చేశాడు.

కాగా, జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచకప్‌కు కోహ్లీని పక్కనపెడతారనే వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే కోహ్లీతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. విండీస్ స్లో పిచ్‌లు కోహ్లీ బ్యాటింగ్ శైలికి సరిపోవని, విరాట్ స్థానంలో యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ స్పష్టతనివ్వాల్సి ఉంది. మరోవైపు, ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌తో అతను తిరిగి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed