ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’‌కు రోహిత్, బుమ్రా నామినేట్

by Harish |
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’‌కు రోహిత్, బుమ్రా నామినేట్
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ ప్రతి నెలా ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జూన్ నెలకు సంబంధించి అవార్డు నామినీలను మంగళవారం ఐసీసీ ప్రకటించింది. అవార్డు కోసం ముగ్గురు పోటీపడుతుండగా అందులో ఇద్దరు భారత క్రికెటర్లే ఉండటం విశేషం. ఒకరు టీమ్ ఇండియా‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన సారథి రోహిత్ శర్మ. మరొకరు టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా. వీరిద్దరికీ జూన్ నెల ఎంతో ప్రత్యేకం. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ ఐసీసీ టైటిల్ సొంతం చేసుకుంది. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ 257 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టోర్నీలో సెకండ్ హయ్యెస్ట్ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు, బుమ్రా బంతితో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు. వీరిద్దరితోపాటు అఫ్గానిస్తాన్ ఓపెనర్ గుర్బాజ్ కూడా అవార్డు రేసులో ఉన్నాడు. 8 మ్యాచ్‌ల్లో 281 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

స్మృతి మంధాన కూడా

మహిళల విభాగంలో భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఈ అవార్డు రేసులో ఉంది. సౌతాఫ్రికాపై వన్డే సిరీస్, ఏకైక టెస్టులో మంధాన అదరగొట్టిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌‌లో స్మృతి 343 పరుగులు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన ఆమె.. మూడో వన్డేలో తృటిలో శతకాన్ని చేజార్చుకుంది. ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్, ఏకైక టెస్టు గెలుపులో ఆమె కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఆమెతోపాటు మైయా బౌచియర్(ఇంగ్లాండ్), విష్మి గుణరత్నే(శ్రీలంక) అవార్డు కోసం పోటీపడుతున్నారు.

Next Story

Most Viewed