పుంజుకున్న బెంగళూరు.. యూపీ వారియర్స్ దూకుడుకు బ్రేక్

by Harish |
పుంజుకున్న బెంగళూరు.. యూపీ వారియర్స్ దూకుడుకు బ్రేక్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-2లో వరుసగా రెండు పరాజయాలు పొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తిరిగి గెలుపు బాట పట్టింది. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 23 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ఈ సీజన్‌లో యూపీని ఓడించడం ఆర్సీబీకి ఇది రెండోసారి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 198 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆర్సీబీ బంతితోనూ మెరిసింది. లక్ష్య ఛేదనకు దిగిన యూపీని కట్టడి చేసింది. నిర్ణీత ఓవర్లలో యూపీ జట్టు 8 వికెట్లను కోల్పోయి 175 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ప్రత్యర్థికి ఓటమి తప్పలేదు. అయితే, కెప్టెన్ అలీసా హీలీ(55) ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ఫోర్లు, సిక్స్‌లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. కానీ, ఆర్సీబీ బౌలర్లు కీలక వికెట్లు తీస్తూ వచ్చారు. కిరణ్ నవ్‌గిరే(18), చమరి ఆటపట్టు(8), గ్రేస్ హ్యారిస్(5), శ్వేతా సెహ్రావత్(1) తేలిపోయారు. హీలీ మాత్రం ఒంటరి పోరాటం చేసింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆమెను మోలినిక్స్ అవుట్ చేసి యూపీకి షాకిచ్చింది. అనంతరం దీప్తి శర్మ(33), పూనమ్ ఖేమ్నార్(31) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆర్సీబీ బౌలర్లలో సోఫి డివైన్, మోలినిక్స్, వారేహమ్, శోభన రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో బెంగళూరు పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి వెళ్లగా.. గుజరాత్ నాలుగో స్థానానికి పడిపోయింది.

వాళ్లిద్దరూ

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ దిగిన బెంగళూరుకు కెప్టెన్ స్మృతి మంధాన(80) అదిరిపోయే ఆరంభం అందించింది. ఎడాపెడా బౌండరీలతో ఆమె యూపీ బౌలర్లను బెంబేలెత్తించింది. మరో ఓపెనర్ సబ్బినేని మేఘన(28)తో కలిసి తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఎల్లీస్ పెర్రీ(58).. స్మృతి మంధానకు తోడైంది. వీరిద్దరూ యూపీ బౌలర్లను ఊచకోత కోయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో స్మృతి మంధాన 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. ఆ తర్వాత అదే దూకుడును కొనసాగించిన ఆమె సెంచరీ చేసేలా కనిపించింది. అయితే, దీప్తి శర్మ బౌలింగ్‌లో అవుటవడంతో రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం రిచా ఘోష్‌తో కలిసి అదే జోరును కొనసాగించిన పెర్రీ 32 బంతుల్లో అర్ధ శతకం నమోదు చేసింది. అయితే, చివరి ఓవర్‌లో తొలి బంతికి పూనమ్ ఖెమ్నార్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు పెర్రీ(58) పెవిలియన్ చేరింది. రిచా ఘోష్(21 నాటౌట్), సోఫి డివైన్(2 నాటౌట్) అజేయంగా నిలువగా.. ఆర్సీబీ 200 పరుగులకు రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. యూపీ బౌలర్లలో తెలుగమ్మాయి అంజలి, దీప్తి శర్మ, ఎక్లోస్టోన్‌లకు చెరో వికెట్ దక్కింది.

సంక్షిప్త స్కోరుబోర్డు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 198/3(20 ఓవర్లు)

(స్మృతి మంధాన 80, ఎల్లీస్ పెర్రీ 58, మేఘన 28)

యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ : 175/8(20 ఓవర్లు)

(అలీసా హీలీ 55, దీప్తి శర్మ 33, పూనమ్ ఖేమ్నార్ 31, మోలినిక్స్ 2/29, శోభన 2/29, సోఫి డివైన్ 2/37, వారేహమ్ 2/38)

Advertisement

Next Story