Ranji Trophy : మళ్లీ విఫలమైన రోహిత్, పంత్, జైశ్వాల్.. అతనొక్కడే చెలరేగాడు

by Harish |
Ranji Trophy : మళ్లీ విఫలమైన రోహిత్, పంత్, జైశ్వాల్.. అతనొక్కడే చెలరేగాడు
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ల వైఫల్యం రెండో రోజు కూడా కొనసాగింది. రోహిత్, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ తేలిపోయారు. జడేజా ఒక్కడే రాణించాడు. జమ్ము అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబైకి ఆడుతున్న రోహిత్ శర్మ(28), యశస్వి జైశ్వాల్(26), శ్రేయస్ అయ్యర్(17) రెండో ఇన్నింగ్స్‌లో కూడా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్, జైశ్వాల్ సింగిల్ డిజిట్‌కే ఔటైన విషయం తెలిసిందే. శార్దూల్ ఠాకూర్(113 బ్యాటింగ్) మరోసారి అదరగొట్టాడు. అజేయ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. తనుష్ కొటియన్(58 బ్యాటింగ్)తో కలిసి అజేయంగా 173 పరుగులు జోడించాడు. దీంతో 101/7 నుంచి ముంబై రెండో రోజు ఆట ముగిసే సమయానికి 274/7 స్కోరు చేసి 188 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు జమ్ము అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 206 స్కోరు చేసింది.

జడేజాకు 12 వికెట్లు

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రవీంద్ర జడేజా 12 వికెట్లతో చెలరేగి సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 188 రన్స్ చేయగా.. సౌరాష్ట్ర 271 స్కోరు చేసింది. శుక్రవారం ముందుగా ఓవర్‌నైట్ స్కోరు‌తో ఆట కొనసాగించిన సౌరాష్ట్ర ఐదు వికెట్ల నష్టానికి 108 రన్స్ జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం జడేజా మరోసారి అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అతను రెండో ఇన్నింగ్స్‌లొ 7 వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ కేవలం 94 పరుగులకే ఆలౌటైంది. పంత్(17) మళ్లీ నిరాశపరిచాడు. ఢిల్లీ నిర్దేశించిన 12 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని సౌరాష్ట్ర 3.1 ఓవర్లలోనే పూర్తి చేయడంతో మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది.




Next Story

Most Viewed