క్రికెట్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదైంది ఇవాళే.. ఆ బౌలర్‌ ఎవరో తెలుసా..?

by Vinod kumar |
క్రికెట్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదైంది ఇవాళే.. ఆ బౌలర్‌ ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో బౌలర్‌ ‘హ్యాట్రిక్‌’ తీస్తే దానికుండే ప్రత్యేకతే వేరు. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే నమోదయ్యే ఈ ఘనతను దక్కించుకున్న బౌలర్లు కూడా తక్కువమందే ఉంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొట్టమొదటిసారిగా వరుసగా మూడు వికెట్లు తీసి ‘హ్యాట్రిక్‌’ నెలకొల్పిన ఆటగాడు ఎవరో తెలుసా..? ఆస్ట్రేలియా దిగ్గజం ఫ్రెడరిక్‌ స్పోఫోర్త్‌ పేరిట ఆ ఘనత ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదైంది జనవరి 2వ తేదీనే కావడం గమనార్హం.

1879 జనవరి 2న ఇంగ్లండ్‌ vs ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌కు ఆరంభ ఓవర్లలోనే ఫ్రెడరిక్‌ చుక్కలు చూపెట్టాడు. వెమోన్‌ రాయల్‌, ఫ్రాన్సిస్‌ మెక్‌కిన్నన్‌, టామ్‌ ఎమ్మెట్‌లను ఔట్‌ చేసి తొలి హ్యాట్రిక్‌ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఫ్రెడరిక్‌.. 25 ఓవర్లు బౌలింగ్‌ చేసి 48 పరుగులే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఫ్రెడరిక్‌ మరింత చెలరేగాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లు వేసి 7 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 13 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాకు టెస్టులలో ఇంగ్లండ్‌పై ఇదే తొలి సిరీస్‌ విజయం.

1877-1887 వరకు 10 ఏండ్ల పాటు క్రికెట్ కెరీర్‌లో 18 టెస్టులు ఆడగా.. 94 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్ల ఘనత ఏడుసార్లు ఉండగా మ్యాచ్‌లో పది వికెట్లు నాలుగు సార్లు తీశాడు. 1926లో చనిపోయిన ఆయన ఆస్ట్రేలియా క్రికెట్‌ 1996లో 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' గుర్తింపునివ్వగా 2009లో ఐసీసీ కూడా 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' గుర్తింపునిచ్చింది. టెస్టులలో ఫ్రెడరిక్‌ తొలి హ్యాట్రిక్‌ నమోదు చేయగా వన్డేలలో పాకిస్తాన్‌కు చెందిన జలాల్‌ ఉద్‌ దిన్‌.. 1982లో తొలి హ్యాట్రిక్‌ నమోదు (ఆస్ట్రేలియాపై) చేశాడు. టీ20లలో ఈ ఘనత సాధించింది ఆసీస్‌ దిగ్గజం బ్రెట్‌ లీ. 2007లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed