దేశ చరిత్రలో తొలి మహిళగా నైనా జైస్వాల్ రికార్డు

by sudharani |   ( Updated:2023-04-20 15:11:09.0  )
దేశ చరిత్రలో తొలి మహిళగా నైనా జైస్వాల్ రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ కేవలం 22 సంవత్సరాల వయస్సులోనే పీహెచ్‌డి డిగ్రీ పూర్తి చేసిన మొట్టమొదటి భారత విద్యార్థినిగా పేరుకెక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ఉన్న ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో ఆమె తన పీహెచ్‌డి పూర్తి చేశారు. తన క్రీడా కెరీర్‌పై దృష్టి పెడుతూనే ఆమె సివిల్ సర్వీసు చేపట్టాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు.

కేవలం 22 సంవత్సరాలకే పీహెచ్‌డీ డాక్టరేట్ డిగ్రీని పొందిన మొట్టమొదటి యువతిని అయినందుకు నిజంగా సంతోషంగా ఉందని జైస్వాల్ మీడియాతో చెప్పారు. నాకు 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఇది మొదలైంది. లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి 8 ఏళ్ల వయసులోనే 10వ తరగతి పూర్తిచేసిన.. ఆసియాలోనే అత్యంత చిన్న అమ్మాయిని నేనే. ఇక 10 సంవత్సరాల వయసులో నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. 13 ఏళ్ల ప్రాయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. భారతదేశంలో అత్యంత చిన్న వయస్సులో జర్నలిజం గ్రాడ్యుయేట్‌ అయ్యాను.

ఆ తర్వాత నేను ఎంఏ పూర్తి చేశాను. ఆసియాలో అత్యంత చిన్నవయస్సులో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది నేనే. 16 సంవత్సరాల ప్రాయంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోసం నా పేరు నమోదు చేసుకున్నాను. ఈరోజు నేను విజయవంతంగా నా పీహెచ్‌డీ పూర్తి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంటోంది. భారతదేశంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి అత్యంత చిన్న వయసు అమ్మాయిని నేనే. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా ఆధారంగా మహిళా సాధికారతలో మైక్రో ఫైనాన్స్ పాత్రపై అధ్యయనం అనేది నా థీసిస్ శీర్షిక. ఈ పరిశోధనను నేను మహబూబ్‌నగర్‌లో చేశాను.

నా పరిశోధన స్వయం సహాయక బృందాలు, మైక్రో ఫైనాన్స్‌కి సంబంధించింది. నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, విద్యార్థినిగా, మహిళా సాధికారతపై నాకు చాలా ఆసక్తి ఉండేది. నా తల్లితండ్రులు, నా గైడ్ సహాయంతో నేను ఈ అంశం ఎంచుకున్నాను. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో దారిద్య్ర నిర్మూలన, ఉపాధి కల్పనతోపాటు మహిళా సాధికారత వంటి అంశాల్లో మైక్రో ఫైనాన్స్ ప్రాధాన్యత కీలకమైనది. నా పరిశోధన ప్రకారం మహిళలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మైక్రో ఫైనాన్స్‌తో ప్రయోజనం పొందారు.





నా తల్లితండ్రుల సహాయంతో బాల్యం నుంచి నేను ఇంట్లోనే ఉండి చదువుతూ వచ్చాను. విద్య, క్రీడలు లేదా సంగీతంలో ఈరోజు నేను సాధించినదంతా నా తల్లిదండ్రుల వల్లే సాధ్యమైంది. బాల్యం నుంచి నా తల్లితండ్రులు నాకూ, నా సోదరుడికీ అత్యంత సరదా వాతావరణంలో విద్య బోధిస్తూ వచ్చారు. విద్య అంటే సృజనాత్మకతే అని వారు చెబుతూ వచ్చారు. సృజనాత్మకత ఆలోచనకు దారితీస్తుంది. ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది. జ్ఞానం విజ్ఞతకు సాయపడుతుంది. విజ్ఞత నిన్ను ఒక లెజెండ్‌ని రూపొందిస్తుందని వారు చెప్పారు.

నాకు అయిదేళ్ల ప్రాయం నుంచి మా అమ్మ శిక్షణలో గడిపాను. తల్లి మొదటి టీచర్ అని గాంధీ చెప్పారు. మా నాన్న మొదట్లో ప్రాథమిక అంశాల్లో నన్ను చక్కగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ బాషల్లో ధారాళంగా మాట్లాడటం, రాయడంలో నేను శిక్షణ పొందాను. మేం ఏం చదివినప్పటికీ, మేం దాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాను. బాల్యం నుంచి నేను మొదటగా ఒక మంచి పౌరురాలిగా ఉండాలని కోరుకునేదాన్ని పేర్కొంది. విద్యకు సంబంధించి, నేను ఇప్పుడు పీహెచ్‌డీ పూర్తి చేసినందున, నా తదుపరి ఆకాంక్ష సివిల్ సర్వీసుకు వెళ్లడమే. క్రీడలకు సంబంధించినంతవరకూ నా క్రీడా కెరీర్‌పై కేంద్రీకరిస్తున్నాను. అనేక అంతర్జాతీయ టోర్లీల్లో, కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గోనాలని కోరుకుంటున్నాను.

నైనా జైస్వాల్ పీహెచ్‌డీ గైడ్ ప్రొఫెసర్ ముర్రు ముత్యాల నాయుడు మాట్లాడారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశాను. డిప్యుటేషన్‌పై నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా వెళ్లాను. వీసీగా ఉన్నప్పుడు కాకతాళీయంగా, అదృష్టవశాత్తూ ఒక సమావేశంలో నేను నైనా జైస్వాల్‌ని కలిశాను. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె బాలమేధావి అని గ్రహించాను. చాలా చిన్న వయసులో పీజీ పూర్తి చేసినట్లు ఆమె చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డాను. పరిశోధనపై ఆసక్తి ఉందని ఆమె చెప్పింది. దాంతో నేను వెంటనే ఆమెను యూనివర్సిటీలో చేరేందుకు ఒప్పించాను.

తర్వాత ఆమె తల్లిదండ్రులతో చర్చింది ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మరుసటి దినం, ఆమెను నా యూనివర్సిటీకి ఆహ్వానించాను. ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించింది. నైనా ప్రసంగం విన్న తర్వాత మా డీన్స్, ప్రిన్సిపాల్స్ అందరూ యూనివర్సిటీలో పరిశోధనకు గాను నైనాకు ప్రవేశం కల్పించాలని నాకు సూచించారు. మేం వెంటనే సమావేశానికి పిలుపునిచ్చి ఒక ప్రత్యేక సందర్భంలో ప్రత్యేకంగా ఆమెకు ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాము. తన పరిశోధనకు నేనే గైడ్‌గా,పర్యవేక్షకుడిగా ఉండాలని ఆమె నన్ను అభ్యర్థించింది. నేను దానికి అంగీకరించాను, యూనివర్సిటీ కూడా నన్ను గైడ్‌గా ఆమోదించించింది. ఆమె పరిశోధనకు నాలుగైదేళ్ల పాటు నేను మార్గదర్శకత్వం వహించాను..

మొత్తానికి ఆమె అద్భుతమైన పరిశోధనా కృషి చేసింది. మేం చాలా మంచి టాపిక్‌ని ఎంచుకున్నాము. ఆమె అద్భుతమైన పుస్తకం రూపొందించింది. ఆమె కృషిని చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆమెకు అద్భుతమైన జ్ఞానం ఉంది. పైగా ఆమెది బహుముఖ వ్యక్తిత్వం.ఇవన్నీ ఆమె కృషిని చాలా సులభం చేసింది. ఆమె మహబూబ్‌నగర్ జిల్లాను స్వయంగా సందర్శించి గొప్ప కృషి చేసింది. ఆమె పరిశోధనను పరిశీలించిన వారు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఆమె మంచి కృషి చేసింది. నేను హృదయపూర్వకంగా నైనా జైస్వాల్‌ను అభినందిస్తున్నాను. ఆమె తల్లితండ్రులు అశ్వని కుమార్ జైస్వాల్, భాగ్యలక్ష్మి జైస్వాల్ కూడా తమ కుమార్తెను చూసి ఎంతో గర్వపడుతున్నారు.


Next Story

Most Viewed